Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐకి హైకోర్టు ఆదేశాలు...
- ఎమ్మెల్యేల ఎర కేసుపై విచారణ సోమవారానికి వాయిదా
నవతెలంగాణ - హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన ఫైళ్లు, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలని కోరితే ఇవ్వడం లేదంటూ సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఆయా దస్త్రాలను ఇస్తే వెంటనే కేసును విచారిస్తామంటూ స్పష్టం చేసింది. సంబంధిత వివరాలను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. సీబీఐ ఉత్తర్వుల తీర్పుపై అప్పీల్‌ను దాఖలు చేశామనీ, దానిపై తీర్పు వెలువరిచేంత వరకు విచారణ జరపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 9న విచారణ వరకూ పైళ్లను ఇవ్వాలని సిట్‌ను ఒత్తిడి చేయొద్దంటూ సీబీఐని ఆదేశించింది. అనంతరం ప్రభుత్వ అప్పీలుపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఫైళ్ల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందంటూ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేయాలనే అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ సీతారామమూర్తి, సీనియర్ న్యాయవాది ఎల్. రవిచంద్ర వాదనలు వినిపించారు. అప్పీల్‌కు విచారణార్హత లేదని, క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పారు, హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయకూడదని తెలిపారు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆఘమేఘాలపై సీఎం మీడియా సమావేశం నిర్వహించి నిందితులకు నష్టం కలిగించేలా దుమ్మెత్తిపోశారని తెలిపారు. ఇది కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నందున సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను యధాతథంగా కొనసాగించాలని అన్నారు. కేసు దర్యాప్తులో ధర్మాసనం జోక్యం చేసుకోవద్దని కోరారు. భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు సీబీఐకి అప్పగించడమే సరైందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్... బీజేపీపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాయని చెప్పారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడి ప్రభుత్వాలను కూల్చారంటూ సీఎం తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. అలాంటిది ఎక్కడా జరగలేదని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోలేదని వెల్లడించారు. తెలంగాణలో మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకు 37 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేర్చుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా ప్రోత్సహించిందనే విషయమై ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను హైకోర్టుకు అందజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు... బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య రాజకీయ వైరం ఉంటే అలాంటి వాటిని కోర్టుల్లో కాకుండా బయట చూసుకోవాలంటూ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినపించాల్సిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ ఢిల్లీలో ఉన్నారని, అందువల్ల సోమవారం వరకు సమయం ఇవ్వాలని ఏజీ బీఎస్ న్యాయస్థానాన్ని కోరారు. సోమవారం కూడా ఆయన ఢిలీలోనే ఉంటారనీ, అందువల్ల ఆన్లైన్ విధానంలో విచారణకు అనుమతించాలని కోరారు. అందుకు అనుమతించిన హైకోర్టు తదుపరి విచారణను సోమవారం మధ్యాహ్నం చేపడతామంటూ ప్రకటించింది. అప్పటి వరకు కేసుకు చెందిన ఫైళ్లను ఇవ్వాలంటూ సిట్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయొద్దంటూ సీబీఐని ఆదేశించింది.