Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగిన సంఘర్ష యాత్ర
నవతెలంగాణ-పరిగి, వికారాబాద్ ప్రతినిధి, చేవెళ్ల, గండిపేట, రాజేంద్రనగర్
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రవాణారంగ కార్మికుల సంక్షేమ బోర్డు, ఆర్టీసీ పరిరక్షణ కై చేపడుతున్న కార్మికుల సంఘర్ష యాత్ర శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన యాత్ర వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగింది. ఉదయం మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సభ నిర్వహించారు. అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రవేశించిన యాత్ర.. వికారాబాద్, చేవెళ్ల నుంచి అప్పజంక్షన్ మీదుగా రాజేంద్రనగర్ నుంచి కాటేదాన్‌కు చేరింది. కాటేదాన్‌లో శుక్రవారం రాత్రి బస చేయనున్నారు. మొదట పరిగిలో ప్రవేశించిన యాత్రకు సీఐటీయూ రవాణా రంగ కార్మికులు ఘన స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి వికారాబాద్ పట్టణానికి యాత్ర చేరుకుంది. ట్రాన్స్పోర్ట్ కార్మికులు యాత్రకు స్వాగతం పలికారు. వికారాబాద్ సోయో అడ్డాల వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్.మహిపాల్ అధ్యక్షతన సభ జరిగింది. అక్కడి నుంచి యాత్ర చేవెళ్లకు చేరింది. సీఐటీయూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో యాత్రకు స్వాగతం పలికారు. చేవెళ్ల పట్టణంలో అంగన్వాడీ, పంచాయతీ, ఆటో, రవాణా రంగ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి బండ్లగూడ కార్పొరేషన్ అప్ప జంక్షన్‌కు యాత్ర చేరుకుంది. అప్ప జంక్షన్ పోలీసు అకాడమీ వద్ద సీఐటీయూ జెండాను వీరయ్య ఆవిష్కరించారు. అక్కడి నుంచి రాజేంద్రనగర్ మీదుగా కాటేదాన్‌కు యాత్ర చేరింది.
ఈ సందర్భంగా ఆయా పట్టణాల్లో నిర్వహించిన సభల్లో జాతీయ ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడారు. మోటార్ వాహన చట్టం 2019లో సవరణలు చేయాలన్నారు. కేరళ రాష్ట్రంలోని సవారీ యాప్ తరహా యాప్‌ను దేశవ్యాప్తంగా తీసుకు రావాలని కోరారు. ఆర్టీసీ కార్మికోద్యమంపై ఆంక్షలు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, పెంచిన ఓవర్ లోడ్ పెనాల్టీ తగ్గించాలన్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందికి పైగా కార్మికులు రవాణా రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకున్న ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో ఈ రంగంలో స్వయం ఉపాధిని పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారని, ప్రభుత్వాలు వారి సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, రవాణా రంగ కార్మికులు పాల్గొన్నారు.