Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్స్పోర్ట్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- హైదరాబాద్‌లో సాగిన సంఘర్ష జీపుజాతా
నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషిరాబాద్
'రవాణ రంగ కార్మికులను ఫైన్లు, చలాన్ల పేరుతో దోచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలేసింది. దినదిన గండం నూరేండ్ల ఆయుషుల్లా నిత్యం అభద్రతాభావంతో గడుపుతున్న కార్మికుల జీవితాల్లో సామాజిక భద్రత కల్పించేందుకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి' అని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఎస్.వీరయ్య, పి.శ్రీకాంత్ నాయకత్వంలో సాగుతున్న సంఘర్ష జీపుజాతా శనివారం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. ఈ యాత్రకు హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ బస్ స్టేషన్లో వందలాది మంది డ్రైవర్లతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతా కాచిగుడ మీదుగా బర్కత్‌పుర డిపో, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపం వద్ద ఉన్న డీసీఎం అడ్డాకు చేరింది. ఆటోడ్రైవర్ల మీటింగ్‌లో ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. 'లక్షలాది మంది కార్మికులు ఆటో, ట్యాక్సీ, లారీ, గూడ్స్, రవాణ, స్కూల్‌బస్సు వంటి వాటిల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరు ప్రమాదాల్లో గాయపడినా, అంగవైకల్యం, అనారోగ్యం పాలైనా ఎటువంటి సహాయం అందే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన వివి.గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్ వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో దేశవ్యాప్తంగా రవాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిపార్సు చేశారు. ఆ సిపార్సులను ఇప్పటికైనా ప్రభుత్వం అమలు చేసి వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలి' అని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మోటారు వాహన చట్టం సవరించి ఎంవీయాక్టు 2019 తెచ్చిందని, దాంతో డ్రైవర్ల ఆదాయాన్ని మూడు ఫైన్లు, ఆరు చలాన్ల విధించి కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా స్టేట్ క్యారేజీలుగా ఉన్న పర్మిట్లను నేషనల్ పర్మిట్లుగా మార్పు చేసి ఆర్టీసీలాగా స్టేట్ క్యారేజీలుగా ప్రయివేటు వాహన యజమానులకు అవకాశమిస్తున్నారని, దాంతో ఆర్టీసీని క్రమంగా దివాళ తీయించే కుట్ర దాగి ఉందని అన్నారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజీలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పేరుతో విపరీతంగా చలాన్లు వేస్తూ కార్మికుల ఆదాయాలను కొల్లగొడుతోందని చెప్పారు. వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందని, దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం రవాణ రంగం కార్మికుల కోసం 'సవారీ' యాప్ తీసుకొచ్చి 8శాతం మాత్రమే కమీషన్ తీసుకుంటున్నదని గుర్తుచేశారు. అలాగే, 6 శాతం నిధులను రాష్ట్ర సంక్షేమ మండలికి ఇస్తున్నదని, రాష్ట్రంలోనూ ఇలాంటి యాప్‌ను తీసుకురావాలని కోరారు. ఇక్కడ ఉబర్, ఓలా సంస్థలు 35శాతం కమీషన్ తీసుకుంటూ క్యాబ్, ఆటో, డ్రైవర్లను దోచుకుంటున్నాయని, దీన్ని 5శాతం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అజరుబాబు, కోశాధికారి సతీష్, నాయకులు కలీమ్, ముఖేష్, ఉమేష్‌రెడ్డి, సాబేరా, అహ్మద్‌ఖాన్, కృష్ణ, కుమార్, ఇషాక్, సిద్ధిక్, పరీద్, నజీర్చ కయ్యూమ్, సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, నగర నాయకులు రమేష్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.