Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాలతో పాలకుల వెనకడుగు
- పోరాటాలన్ని ఒకే వేదికగా జరగాల్సిన పని లేదు
- విరసం సాహిత్య పాఠశాలలో ఆకార్ పటేల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఫాసిజంపై పోరాటానికి భారతదేశంలో అవకాశాలింకా ఉన్నాయి. పలు పోరాటాల సందర్భంగా హిందుత్వ పాలకులు వెనకడుగు వేశారు. రైతు ఉద్యమం, షాహీన్ బాగ్ పోరాటాలు విజయం సాధించాయనీ, సీఏఏ చట్టాన్ని అమలు చేయకుండా నిలుపగలిగాం... ప్రజలు ఇష్టపడే చాలా విషయాల పట్ల హిందుత్వకు ఆసక్తి లేదు. వారందరితో కలిసి ఫాసిజానికి వ్యతిరేక పోరాటం చేయవచ్చు....' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా చాప్టర్ చైర్మెన్ ఆకార్ పటేల్ తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం (విరసం) 23వ సాహిత్య పాఠశాల ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎస్సాఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకతలు అనే అంశంపై ప్రసంగించారు.
దేశంలో ఫాసిస్టు ధోరణులతో సమాజంలో జరుగుతన్న అన్యాయాలు, అక్రమాలపై పోరాటాలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేవని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నేపథ్యం కారణంగా ఇక్కడ ప్రత్యేక రీతిలో ఉద్యమాలు జరుగుతుంటే, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. ఫాసిజం అంటే దేశాన్ని, జాతిని వ్యక్తి కన్నా ఎక్కువగా చేసి మనిషి మామూలు వ్యక్తిగా మార్చడమన్నారు. పాలకులు నియంతలుగా ఉండటం, అధికార వికేంద్రీకరణ వంటివి ఫాసిజం లక్షణాలని వివరించారు. ఆ ఫాసిస్టు పాలన రాజకీయ ప్రత్యర్థులతో పాటు మేధోపరమైన ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని తెలిపారు.
స్పష్టత లేని హిందుత్వ...
ఇతర మతాలకు, నియంతలకు ఉన్నట్టుగా హిందుత్వానికి ప్రామాణిక గ్రంథం లేదని స్పష్టం చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యారు ఆయా సందర్భాల్లో మాట్లాడిన మాటలు, రాసిన వ్యాసాలనే హిందుత్వవాదులు ఆధారం చేసుకున్నారని పటేల్ చెప్పారు. రాజ్యంతో సహా రాజ్యాంగ సంస్థలకు విమర్శించడం, ప్రతిఘటించే హక్కు లేకుండా చేయడమే దాని లక్ష్యమని తెలిపారు. హిందుత్వకు స్పష్టత లేదనీ, సమాజాన్ని ఎటువైపు నడిపించాలనే దానిపై నిర్దిష్టత కొరవడిందని విమర్శించారు. ప్రపంచంలో నేపాల్ ఒక్కటే హిందూ దేశమని తెలిపారు. అక్కడ అనువంశిక క్షత్రియులు పాలకులుగా, పురోహితులు సలహాదారులుగా ఉండటమే అందుకు కారణమని వివరించారు. అయితే భారతదేశానికి రాజ్యాంగం ఉందనీ, హిందుత్వ వాదులు హిందూ దేశమంటే ముందుగా రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘించాల్సి ఉంటుందన్నారు. ఆ పని హిందుత్వవాదులు చేయలేరని ఆకార్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు.
గోల్వాల్కర్ కులవ్యవస్థను పని విభజన చేసిన అత్యంత విశిష్టమైన అంశంగా పేర్కొన్నారనీ, మతపరమైన మైనార్టీ లను పుట్టుకతో వంచకులుగా ప్రకటించారని గుర్తుచేశారు. దీన్ని పాటిస్తూ బీజేపీ మైనారిటీలను పాలన నుంచి దూరంగా పెడుతూ, హింస ద్వారా జన సమీకరణ చేస్తూ బలోపేతం అయిందంటూ అద్వానీ రథయాత్ర సందర్భాన్ని ప్రస్తావించారు. సంఫ్‌ుపరివార్ నిషేధం తర్వాత రాజకీయ పార్టీ అవసరాన్ని గుర్తించిందన్నారు. హిందూ జాతీయ వాదానికీ, ఇతర దేశాల్లో జాతీయవాదానికి తేడా ఉందని తెలిపారు. మన దేశంలో ఫాసిజానికి అంతర్గతంగా ఉన్న మత మైనార్టీలు, ముఖ్యంగా ముస్లీంలు శతృవులైతే, ఇతర దేశాల్లో బయటి శక్తులని వివరించారు. ఫాసిస్టులకు రాజ్యాంగం పట్ల విధేయత లేదనీ, ఉపా చట్టం ప్రయోగం, 370 ఆర్టికల్ రద్దు, లవ్ జిహాద్ సాకుతో మతాంతర వివాహాలు చేసుకునే వారిని వేధించే చట్టాలు, గోమాంసం సాకు చూపి అరెస్టు చేయడం, హిజాబ్ ధరించే వారిని లక్ష్యంగా చేసుకోవడం, రాజ్యాంగ సంస్థలు చేసే పనిని మూకలకు అప్పగించడం వంటి తెంపరి చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో జన్సంఫ్ు యాంత్రీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ బీజేపీ పూర్తి యాంత్రీకరణ చేస్తున్నదని తెలిపారు. నిలకడ లేని బీజేపీపై పోరాడేందుకు అవకాశాలున్నాయంటూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.