Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల పనితీరుపై మంత్రి అసహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాదులోని డీఎస్ఎస్ భవన్లో ఎస్సీ సంక్షేమ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యాలయానికి వస్తున్నారు గానీ..ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కోసం పనిచేయటం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప మధ్యలో నిలిపి వేయడమేంటని ప్రశ్నించారు. బాధ్యత లేకుండా వ్యవహరించొద్దన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పనులు, కమ్యూనిటీ భవన నిర్మాణాల గురించి ఎమ్మెల్యే, మంత్రుల దృష్టికి తీసుకెల్లాల్సిన బాధ్యత,వాటిని పూర్తి చేయాల్సిన అవసరం అధికారులపై ఉంటుందన్నారు. నిధులు లేవన్న సాకుతో పనులు నిలిపేయడమేంటని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై కూడా సమీక్షించారు. నెలలో ఒకటి రెండు సార్లు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేయాలని ఆదేశించారు. వసతి గృహల్లో వంట, స్టోర్ రూమ్లు పరిశీలించాలన్నారు.
వాటిల్లో విద్యార్థులకు అవసరమైన వసతుల గురించి తెలుసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల పెండింగ్ స్కాలర్ షిప్పుల గురించి అధికారులను అడిగి తెలుసు కున్నారు. విద్యా, వైద్య రంగం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు విద్యార్థులకు ప్రయోజనం చేకూరె విధంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అడిషనల్ కమిషనర్ ఉమా దేవి, స్పెషల్ సెక్రటరీ విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.