Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
- ఆస్పత్రులకు మందుల పంపిణీలో పరిమితి ఉండకూడదు
- ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం మనందరి బాధ్యత
- సమీక్షలో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి నేషనల్ హెల్త్ మిషన్, తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థలపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలనకు వచ్చే నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 23 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 డయాగస్టిక్ సెంటర్లను,12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమీపంలో తొమ్మిది క్రిటికల్ కేర్ ఆస్పత్రులు సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య, కటుంబ సంక్షేమం కమిషనర్ శ్వేతా మహంతి, టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, డీఎంఇ రమేష్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.