Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్రాంతికి ప్రజలను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు
- బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు : వీసీ సజ్జనార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకుగానూ టోల్గేట్ల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసినట్టు టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ తెలిపారు. పండుగను పురస్కరించుకుని 4,233 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ప్రకటించారు. ప్రతి టోల్‌గేటు వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. బస్‌భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాన మార్గాల్లోని టోల్‌ప్లాజా వద్ద టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లైన్లు కేటాయించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఎఐ), తెలంగాణ ఆర్ అండ్ బీ విభాగాలకు లేఖలు రాయగా ఈ నెల పదో తేదీ నుంచి 14 వరకు అనుమతి లభించిందని వివరించారు. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పంతంగి, కొర్లపహాడ్, హైదరాబాద్-వరంగల్ మార్గంలోని గూడూరు, హైదరాబాద్-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలోని మనోహరబాద్, హైదరాబాద్-కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామనీ, ప్రతిచోటా ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించనున్నారని తెలిపారు.
బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. ప్రజలందరూ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు.