Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు, వివిధ రకాల సంక్షేమ హాస్టళ్లలో మెనూ ఛార్జీలను పెంచాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వివిధ రకాల సంక్షేమ హాస్టళ్లలో 2015, ఆగస్టులో అప్పటి నిత్యావసర ధరల ప్రకారం మెనూ ఛార్జీలను నిర్ణయించారని తెలిపారు. ఏడేండ్లు పూర్తయినా పాత మెనూయే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే మెనూతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా మెనూ ఛార్జీలను ఇప్పటికే పెంచుతారని ఆశించామని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ పెంచలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వివిధ సంక్షేమ హాస్టళ్లు, రాష్ట్ర గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో పెరిగిన నిత్యావసర ధరలకనుగుణంగా మెనూ ఛార్జీలను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.