Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనల ప్రకారమే కొలువులు
- ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను సంప్రదించాలి
- అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగాలిప్పిస్తామనే మధ్యవర్తులను, అసాంఘిక శక్తులను నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు మధ్యవర్తులు, జాబ్ రాకెటర్లు అమాయకులు, నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ తప్పుడు హామీలిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇలాంటి నమ్మొద్దని కోరారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందాలనుకునే వారు తొలుత వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) నమోదు చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ అయ్యాక దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రాతపరీక్షకు హాజరు కావాలనీ, ఆ తర్వాత మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తామనీ, తుది నియామకాల జాబితాను సిద్ధం చేసి సంబంధిత శాఖకు పంపిస్తామని వివరించారు. ఆ శాఖ ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులిస్తుందని తెలిపారు. వ్యక్తిగతంగా టీఎస్పీఎస్సీ ఎవరినీ నేరుగా ఉద్యోగాల్లో నియమించబోదని స్పష్టం చేశారు. మధ్యవర్తులు, బ్రోకర్లను నమ్మి డబ్బులివొద్దని కోరారు. ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్థులు అలాంటి తప్పుడు హామీలకు మోసపోద్దని సూచించారు. తప్పుడు ధ్రువపత్రాలు, ఈమెయిల్, నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. తమ కార్యాలయంలో పబ్లిక్ రిలేషన్ విభాగానికి ఫోన్ చేసి వాస్తవ సమాచారాన్ని పొందాలని తెలిపారు.
నేడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు రాతపరీక్ష
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) పోస్టులకు ఆదివారం రాతపరీక్ష జరగనుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 26,751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు 20,016 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు పేపర్-1కు ఉదయం 9.15 నుంచి 9.45 గంటల్లోపు, పేపర్-2కు మధ్యాహ్నం 1.45 నుంచి 2.15 గంటల్లోపు పరీక్షా కేంద్రాల్లోకి రావాలని కోరారు. ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ పరీక్ష నిర్వహణపై శనివారం టీఎస్పీఎస్సీ చైర్మెన్ బి జనార్దన్‌రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా పర్యవేక్షించారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలంటూ అభ్యర్థులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించామని పేర్కొన్నారు.
మార్చి ఐదుకు ఏఈఈ పరీక్ష వాయిదా
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీరింగ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేనెల 12న నిర్వహించనున్న రాతపరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేరోజు గేట్ రాతపరీక్ష ఉందని తెలిపారు. అభ్యర్థులు నష్టపోకూడదనే కారణంతో అసిస్టెంట్ ఇంజినీర్స్ పోస్టులకు రాతపరీక్షను ఫిబ్రవరి 12 నుంచి మార్చి ఐదో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.