Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాని విలువ రూ.18 లక్షలు
నవతెలంగాణ-హయత్‌నగర్
చదువు పేరుతో దేశంలోకి చొరబడి నకిలీ పాస్ పోర్ట్, వీసాలు సృష్టించి కొకైన్‌ను విద్యార్థులకు సరఫరా చేస్తున్న నైజీరియాకు చెందిన గాడ్విన్ ఇఫియాంగ్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, హయత్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ వివరాలు తెలిపారు. గాడ్విన్ ఇఫియాంగ్ అనే వ్యక్తి మోరీస్ మేషాగ్ని ఉమర్ పేరుతో చదువు కోసమంటూ ఇండియాకు వచ్చాడు. డబ్బు కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చి రూ.10వేలకు గ్రాము చొప్పున అమ్ముతున్నాడు. గతంలో అతను ధూల్‌పేట్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి విడుదలయ్యాడు. అనంతరం నకిలీ పాస్‌పోర్ట్‌ను కలిగి 3 నెలల్లో 400 సిమ్ కార్డులు కొనుగోలు చేసి ఉపయోగించాడు. ఇప్పటి వరకు అతను 22గ్రాముల కొకైన్ అమ్మాడు. ఈ క్రమంలో ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ ఆదేశాల మేరకు నిందితుడిని పట్టుకున్నారు. వనస్థలిపురం హుడా పార్క్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకుని 178 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ జరిపి దీని వెనుక ఎవరెవరు ఉన్నారో త్వరలో వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్లు తెలిపారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ శివ జ్యోతి, ఎస్ఐలు కృష్ణకాంత్, సంధ్య, నరేష్, సరళ ఉన్నారు.