Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజ హితం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుల మార్గదర్శకత్వంలో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల చిత్రపటాలతో మంచి క్యాలెండరు ముద్రించడం అభినందనీయమన్నారు. నేటితరం అనేక తప్పుడు మార్గాల్లో పయనిస్తుందనీ, సమాజంలో కుల, అసమానతలు అంతం కావాలనే లక్ష్యంతో జ్యోతిబాఫూలే, అంబేద్కర్ పోరాడారని గుర్తుచేశారు. వారి జీవిత చరిత్రలను నేటితరం పఠనం చేయాలన్నారు. రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రకాల పౌర స్వేచ్ఛ లను ఆహ్వానించాలని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా కృషి చేయాలన్నారు. కేవీపీఎస్ అనేక సామాజిక ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్ వెస్లీ, టీ స్కైలాబ్ బాబు, కరెన్సీ నోట్ పై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, కేవీపీఎస్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం దశరథ్, నగర అధ్యక్షులు టి సుబ్బారావు నాయకులు దర్శనం వీరన్న తదితరులు పాల్గొన్నారు.