Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5 చలో పార్లమెంట్‌ను జయప్రదం చేయండి
- సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మికసంఘం పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాల ను వ్యతిరేకిస్తూ ఆదివారం నాడు హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం నేతలు తెలిపారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన చలో పార్ల మెంట్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యా లయంలో ఆ సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందనీ, దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చేయాలని కోరారు. విద్యుత్ సవరణ చట్టం, నూతన విద్యావిధానం, ఎమ్వీ యాక్టులను వ్యతిరేకిస్తూ ఆదివారం నాడు రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పై డిమాండ్లపై వచ్చే మూడు నెలల పాటు గ్రామ, మండల స్థాయిలో విస్తృత స్థాయి ప్రచారం జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు.