Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడ్‌సెట్ మినహా అన్ని సెట్లకూ కొత్త కన్వీనర్లు
- ఉన్నత విద్యామండలి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను నిర్వహించే విశ్వవిద్యాలయాలు, కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎడ్‌సెట్ మినహా అన్ని సెట్లకూ కొత్త కన్వీనర్లను నియమించింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయినా ఉన్నత విద్యామండలి కన్వీనర్లను మార్చడం చర్చనీయాంశంగా మారింది. ప్రవేశ పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు, కన్వీనర్ల పేర్లను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూ హైదరాబాద్‌కు మళ్లీ అప్పగించారు. అయితే గతేడాది కన్వీనర్‌గా కొనసాగిన ఎ గోవర్థన్ స్థానంలో జేఎన్టీయూ హైదరాబాద్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ బి డీన్‌కుమార్‌ను నియమించారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ గతేడాది ఓయూ నిర్వహించగా, ఇప్పుడు జేఎన్టీయూ హైదరాబాద్‌కు అప్పగించారు. పీజీఈసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూ హైదరాబాద్ గణితం విభాగం ప్రొఫెసర్ బి రవీంద్రరెడ్డి నియమితులయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయానికే మళ్లీ అప్పగించారు. కన్వీనర్‌గా కేయూ కామర్స్ విభాగం ప్రొఫెసర్ పి వరలక్ష్మిని నియమించారు. పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల్లో చేరేందుకు నిర్వహించే ఈసెట్‌ను గతేడాది జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించగా, ఈ ఏడాది ఓయూకు అప్పగించారు. ఈసెట్ కొత్త కన్వీనర్‌గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరామ్ వెంకటేశ్ నియమితులయ్యారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నిర్వహణ బాధ్యతను మళ్లీ ఓయూకు అప్పగించారు. కొత్త కన్వీనర్‌గా ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మిని నియమించారు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ను గతేడాది ఓయూ నిర్వహించగా ఈసారి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ ఎ రామకృష్ణ కొనసాగిస్తున్నారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్‌ను గతేడాది మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కాగా, ఇప్పుడు శాతవాహన విశ్వవిద్యాలయానికి ఆ బాధ్యతను అప్పగించారు. వి సత్యనారాయణ స్థానంలో పీఈసెట్ కొత్త కన్వీనర్‌గా ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ నియమితులయ్యారు. మే, జూన్ నెలల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే తేదీలను ఖరారు చేసి ప్రకటించే అవకాశమున్నది.