Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పారామెడికల్ సిబ్బంది పట్ల వివక్ష
- వైద్యవిధాన పరిషత్ ఉద్యోగుల ఇబ్బందులు తీరేనా?
- ట్రెజరీ జీతాలుండవు...హెల్త్ కార్డులకు దిక్కుండదు
- అయినా జీవో నెంబర్ 317 అమలు కాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక శాఖలో పని చేస్తూ ఒకే రకమైన పని చేస్తున్న వారికి ఒకే రీతిగా జీతాలొస్తాయి. సౌకర్యాలు కూడా సమానంగా ఉంటాయి. ఇబ్బందులున్నా అందరికీ ఒకేలాగా ఉంటాయి. ఇది సాధారణంగా అందరికి ఉండే భావన. కాని అది వైద్యారోగ్యశాఖకు వర్తించదు. ఆ శాఖలో మిగిలిన విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందితో పోలిస్తే వైద్య విధాన పరిషత్‌లో పని చేసే వారికి అదనపు సమస్యలున్నాయి. అవి ఇప్పటివీ కావు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ముందు నుంచి ఉన్న సమస్యలు. తెలంగాణ వస్తే తమ సమస్యలన్ని పరిష్కారమవుతాయని భావించారు. అప్పటికీ పరిష్కారం కాకపోగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు పూర్తి స్థాయిలో పని చేసే కమిషనర్ వస్తే తీరుతాయనుకున్నారు. అయినప్పటికీ అవే సమస్యలు వెంటాడుతుండటంతో పదే పదే ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతిపత్రాలు సమర్పించుకుంటూ ఆశతో ఎదురు చూస్తున్నారు.
జోన్ల వారి విభజన ఎప్పుడు?
వైద్యారోగ్యశాఖలోని ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు జోన్ల వారీగా విభజన జరుగుతుంటే వైద్యవిధాన పరిషత్‌లో మాత్రం ఇప్పటికీ బదిలీలకు అవకాశం కల్పించలేదు. 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపు లేకపోవడం, ఆరోగ్యశాఖలో పని చేస్తున్న వారికి హెల్త్ కార్డులు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ విభాగంలో పని చేస్తున్న నర్సుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. గత 20 ఏండ్లుగా పదోన్నతులు రాకపోవడంతో పాటు తమతో పాటు ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నత పొజిషన్లోకి వెళ్తున్నా ఏమి చేయలేని నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులకు గత కొన్నేండ్లుగా ఇన్‌సర్వీస్ ట్రైనింగ్ లేకపోవడంతో వారి విద్యార్హతల ఆధారంగా పోస్టులను పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈ ఉద్యోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా అప్‌గ్రేడ్ అయిన వైద్యకళాశాలలోనే తమ విధులను కొనసాగించేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు.
మొర ఆలకించరా?
ఉద్యోగులు పదే పదే కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ ఫలితం దక్కడం లేదు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామనే సమాధానమే వస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆ ప్రతిపాదనలకు రాష్ట్ర సర్కారు నుంచి ఎప్పటికీ గ్రీన్ సిగల్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ద్వారా వైద్యవిధాన పరిషత్‌ను ఏర్పాటు చేశారు. అటానమస్‌గా ఏర్పడిన ఈ విభాగంలో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులు హెల్త్ కార్డులకు నోచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇతర సౌకర్యాలు కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. తెలంగాణ వస్తే హెల్త్ కార్డులిస్తామని హామీని ఇచ్చింది. ఇప్పటికీ హెల్త్ కార్డులు లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైన సందర్భంలో వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. వీటిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు దాదాపు 12 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, నాలుగో తరగతి తదితరులు రోగులకు సేవలందిస్తున్నారు.
సమస్యలు పరిష్కరించాలి ...బైరపాక శ్రీనివాస్
వైద్య విధాన పరిషత్‌లో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్య లను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) కార్యదర్శి బైరపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బదీలీలు, మెడికల్ కాలేజీల్లోకి సిబ్బందిని అనుసంధానించడం, ట్రెజరీ ద్వారా జీతాలివ్వడం, హెల్త్ కార్డులు జారీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును కోరారు.