Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం అడ్డా స్థలాలు కేటాయించాలి
- ఆర్టీసీని పరిరక్షించాలి :పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్
ఫెడరేషన్ (సీఐటీయూ) జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్
- వాహనాలతో భారీ ర్యాలీ, బహిరంగ సభ
నవతెలంగాణ- యాదగిరి గుట్ట/ జనగామ/కాజీపేట/వరంగల్
యాదగిరిగుట్ట పైకి అటోలకు అనుమతించాలని, గుట్టపైకి వచ్చే వేలాది మంది భక్తులకు రవాణా సౌకర్యం కోసం కారు, అటోలకు అడ్డా స్థలాలు కేటాయించాలని పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలపై చేపట్టిన కార్మిక సంఘర్ష యాత్ర 8వ రోజైన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం చేరుకున్నది. ఈ సందర్భంగా వడాయిగూడెం చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. అక్కడినుంచి భువనగిరి పట్టణానికి చేరుకున్న యాత్రకు పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి రైతు బజార్ వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించి కార్ల అడ్డా వద్ద సభ నిర్వహించారు. అక్కడినుంచి సాయంత్రం జనగామ జిల్లాకు యాత్ర చేరుకుంది. జనగామ పట్టణంలోని కళ్ళెం రోడ్డు కమాన్ నుంచి వందలాది వాహనాలతో ర్యాలీగా వెళ్లి మంగళ హారతులు ఇచ్చి యాత్రకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడే సభ నిర్వహించారు. అక్కడి నుంచి హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌కు యాత్ర చేరుకోగా.. ట్రాన్స్‌పోర్టు కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. కాజీపేట మండలం మడికొండ, రాంపూర్‌తో పాటు హనుమకొండ డిపో రవాణా రంగ కార్మికుల సంఘర్షయాత్ర చేరుకోగా సీఐటీయూ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వరగల్ జిల్లా కేంద్రానికి చేరుకోగా పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ వద్ద నాయకులు స్వాగతం పలికి వరంగల్-1, వరంగల్-2 డిపోలకు ర్యాలీ నిర్వహించి, సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పట్టణాల్లో జరిగిన సభల్లో ఎస్. వీరయ్య, శ్రీకాంత్ మాట్డాడుతూ.. 50ఏండ్లకు పైగా అటోలను యాదాద్రి గుట్టపైకి అనుమతించిన దేవస్థానం అధికారులు ఇప్పుడెందుకు అటోలను అనుమతించడం లేదో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో కార్మికులు కోరిన చోట అటో, కారులకు అడ్డా స్థలాలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వయం శక్తితో బతుకుతున్న 20 లక్షల మంది రవాణా కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేసే నూతన మోటారు వాహన చట్టం-2019ని సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల, పట్టణ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో అడ్డా స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2021 జూన్ 30న జీవో 25 ద్వారా కనీస వేతనాన్ని రు.18,019 గాను, హైస్కిల్డ్ వర్కర్‌కు రూ.39,837గా నిర్ణయించారన్నారు. కానీ ప్రయివేటు యాజమాన్యాల ఒత్తిడి మూలంగా ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని గెజిట్‌లో పెట్టి కనీస వేతనాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాక్ట్ 1950 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 రేషియోలో మూలధన పెట్టుబడి ఆర్టీసీలకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రవాణారంగ కార్మికులందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్డఋ్ల్యఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని, కార్మిక సంఘాలపై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన రెండు పీఆర్సీలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించి ఆర్టీసీ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులు రాత్రి 8 గంటల లోపు దిగే డ్యూటీలను వేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ఈ యాత్రలో ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.