Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాభిప్రాయ సేకరణ గాలికి
- కామారెడ్డిలో ముదిరిన వివాదం
- రైతు ఐక్యకార్యాచరణ కమిటీ భేటీ
- 11న మున్సిపల్ కార్యాలయం ముట్టడికి తీర్మానం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై రగడ కొనసాగుతోంది. ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్ రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగించాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం భేటీ అయ్యింది. ఈ నెల 11వ తేదీన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముట్టడించాలని నిర్ణయించింది. కాగా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో కనీస మార్గదర్శకాలు పాటించలేదని స్పష్టమయ్యింది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఈ విషయమై బాధిత రైతులను సంప్రదించగా.. తమకు కనీస సమాచారం కూడా లేదని వాపోతున్నారు. మొత్తం 15,209 ఎకరాలతో కామారెడ్డి మాస్లర్‌ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. ఇందులో పారిశ్రామిక జోన్ కోసం ఏకంగా 1,195 ఎకరాలు, వాణిజ్య జోన్ 551 ఎకరాలు ప్రతిపాదించారు. అయితే పారిశ్రామిక జోన్ కోసం వ్యవసాయ భూములను సేకరిస్తున్నారని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామలైన టెక్రియాల్, అడ్లూర్, రామేశ్వర్‌పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట్, రామేశ్వర్‌పల్లి, సరంపల్లి, దేవునిపల్లి గ్రామాలను కలుపుకుని మున్సిపల్ అధికారులు కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదించారు. అయితే మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఇచ్చిన మార్గదర్శకాలకు, టౌన్ ప్లానింగ్ యాక్ట్-1920కు తిలోదకాలిస్తూ ఈ మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భాగస్వామ్య పక్షాలన్నింటినీ సంప్రదించి మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సి ఉన్నప్పటికీ.. కేవలం ఓ ప్రయివేటు కన్సెల్టెంట్‌కు ఇచ్చి 'రియల్' భూమ్ లక్ష్యంగా ప్లాన్ రూపొందించినట్టు రైతులు విమర్శిస్తున్నారు. సాధారణంగా మాస్టర్ ప్లాన్ రీజినల్ డెవలప్మెంట్, జోనల్ డెవలప్మెంట్ ప్రణాళికలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి? ఏమేమీ అభివృద్ధి చేయనుంది? ఏ ప్రాంతంలో ఏమీ నిర్మించనుంది? అనే ప్రతి విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాల్సి ఉన్నప్పటికీ.. కామారెడ్డిలో అవేమీ జరగలేదు. పైగా ప్రజల అభ్యంతరాలను స్వీకరించలేదు. ఇదే ప్రస్తుతం పెద్ద ఉద్యమంగా మారింది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతులకు.. వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ రూపొందించడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పైగా మాస్లర్‌ప్లాన్ ముసాయిదాను సైతం బాధిత(విలీన) గ్రామాల్లో ఎక్కడా ప్రదర్శించలేదు. కాగా, మ్యాప్‌తో పాటు ప్రజలకు అర్థం అయ్యే విధంగా ప్రణాళికలను స్థానిక భాషల్లో రాస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలి. కానీ అది కూడా జరగలేదు. ముసాయిదా రూపొందించే సమయంలోనే అభ్యంతరాలను స్వీకరించి దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి. అలాగే ముసాయిదా విడుదలయిన తర్వాత కూడా తుది ఆమోదానికి ముందు మళ్లీ అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ అభ్యంతరాలపై బాధితులతో సంప్రదించాలి. అయితే కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదా మాత్రమేనని, మార్పులు చేర్పులు చేస్తామని జిల్లా కలెక్టర్‌తో పాటు అధికార పార్టీ నాయకులు అంటున్నారు. పైగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. మాస్టర్‌ప్లాన్‌లో కన్సల్టెంట్ తప్పిదం చేసిందని ఆరోపించారు. అయితే తాము నెల రోజులుగా ఆందోళన చేస్తే ఈ విషయం ఎందుకు చెప్పలేదని రైతుల ప్రశ్నిస్తున్నారు. తమ దృష్టి మరల్చేందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
11న మున్సిపల్ కార్యాలయం ముట్టడి..
మాస్టర్‌ప్లాన్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆపబోమని రైతు కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించింది. నేడు (సోమవారం) కౌన్సిలర్లకు వినతిపత్రాలు సమర్పించాలని, 11వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించింది.
నేడు హైకోర్టులో విచారణ?
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ వ్యతిరేకిస్తూ రామేశ్వర్‌పల్లిలోని సుమారు 40 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం(నేడు) విచారణకు వచ్చే అవకాశముంది. సహజ న్యాయానికి వ్యతిరేకంగా కనీసం తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించకుండా పిటిషనర్లకు సంబంధించిన 131, 129, 127 తదితర సర్వే నెంబర్లలోని వ్యవసాయ భూమిని ప్రతిపాదించినట్టు ఆరోపించారు.
ప్రభుత్వ భూముల్లో గ్రీన్, ఇండిస్టీ జోన్లు ఏర్పాటు చేయాలి - వెంకట్‌గౌడ్, కామారెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
కామారెడ్డిలో ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. అలాగే అసైన్డ్ భూములు వందల ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల తారుమారు చేసి రియల్ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అలాంటి భూముల్లో గ్రీన్, ఇండిస్టీజోన్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములను రైతుల వద్ద నుంచి తీసుకోవడం సరికాదు. కామారెడ్డి పట్టణానికి అనుకొని ఉన్న ఆల్కహాల్ ఫ్యాక్టరీ భూములు ఈ విధంగానే అన్యాక్రాంతమయ్యాయి. ఒకప్పుడు రైతుల నుంచి సర్కారు సేకరించి ఇప్పుడు ప్రయివేటు వ్యక్తులకు విక్రయిస్తోంది. సుమారు 80 ఎకరాల వరకు ఉంది. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అలాగే మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన రింగ్‌రోడ్డు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఏర్పాటు చేశారు. దీన్ని మార్చాలి.
రద్దు చేయాల్సిందే : తిరుపతిరెడ్డి మాసిరెడ్డి ( అడ్లూర్ ఎల్లారెడ్డి)
కొత్త మాస్టర్‌ప్లాన్‌లో అడ్లూర్ఎల్లారెడ్డిలో ఇండిస్టియల్ జోన్లో ప్రతిపాదించారు. దీనివల్ల మా వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుంది. మేం వ్యవసాయం చేసుకుని జీవించేవాళ్లం. మా భూములు కోల్పేతే మా బతుకుదెరువు ఎలా?