Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజ్ఞానదర్శిని కార్యక్రమంలో ప్రజాస్వామికవాదులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భావప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడుకుందామని విజ్ఞానదర్శిని సమావేశం తీర్మానించింది. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజ్ఞానదర్శినీ కన్వీనర్ రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామికవాదులు తదితరులు పాల్గొన్నారు.రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాపాడుకోవడం పౌరులందరి బాధ్యత అని సమావేశం అభిప్రాయపడింది. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మాట్లాడినా ప్రవర్తించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని కోరింది. ఎవరు ఎవరిపైనా దాడులకు పాల్పడరాదని ఆకాంక్షించింది. రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న మతోన్మాద రాజకీయ శక్తులు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలో భాగంగానే హేతువాదులు, నాస్తికులు, బహుజనులపై దాడులు జరుగుతున్నాయంటూ పేర్కొంది. ఆ దాడులను ఖండించింది. హేతువాదం, నాస్తికత్వం, భౌతికవాదం చార్వాకులు, లోకాయతులు, బుద్ధుడి నుంచి మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ అందించిన భారతీయ తాత్విక వారసత్వమని స్పష్టం చేసింది.
''మానవ మనుగడ పురోగమనానికి మూలం ప్రశ్నించే తత్వం. ప్రశ్న లేకపోతే మానవ ప్రగతి లేదు. ఆ ప్రశ్ననే దాడులకు గురవుతున్నది. హత్య చేయబడుతున్నది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను గుర్తు ఎరిగిన ప్రజాతంత్ర వాదులు, ప్రజా, పౌర సంస్థల ప్రతినిధులు అందరం రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా కృషి చేస్తాం. ఇందుకోసం రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా మా కార్యాచరణ ఉంటుంది. చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానాల తీర్పు ప్రకారం వ్యవహరించాలి. దానికి విరుద్ధంగా దాడులకు పాల్పడడం చట్ట వ్యతిరేకమే కాక రాజ్యాంగ వ్యతిరేకం..... '' అని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్న బైరి నరేష్‌పై, పాటలు పాడుతున్న రేంజర్ల రాజేష్‌పై మతోన్మాదం, మనువాదుల దాడులను సమావేశం ఖండించింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని కోటగిరి గ్రామంలో పాఠశాలలో పనిచేస్తున్న దళిత టీచర్ మల్లికార్జున్ ను అత్యంత దారుణంగా అవమానించి, తన నమ్మకాలకు విరుద్ధంగా గుడిలోకి తీసుకెళ్లి బలవంతంగా క్షమాపణలు చెప్పించి బొట్టుపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి చట్టాన్ని ఉల్లంఘించి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. టీచర్ మల్లికార్జున్ పై జరిగిన దాడిని సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, పీఓడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్త దేవి తదితరులపై మతోన్మాదులు చేస్తున్న దాడులను సమావేశం ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టింగ్‌లు పెడుతూ, వారి ఇండ్లపై దాడి చేయడం సరి కాదని తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు విరుద్ధంగా తానే తీర్పులు చెప్పే విధంగా వ్యవహరించి అరాచకశక్తులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేసిన మీడియాపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), పాండురంగాచారి (సీపీఐ), చలపతిరావు (సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), హన్మేష్ (సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా), డాక్టర్ జిలకర శ్రీనివాస్ ( ద్రావిడ బహుజన సమితి పార్టీ), కొమ్ముల శ్రీనివాస్ (డీఎంకె పార్టీ), ప్రొఫెసర్లు హరగోపాల్, కాశీం, సురేపల్లి సుజాత, కవి జయరాజ్, టి.వి.రావు ( జనవిజ్ఞాన వేదిక), జీడి సారయ్య (భారత నాస్తిక సమాజం), రషీద్ (భారత నాస్తిక సమాజం), రాజకీయ పార్టీల మహిళా, విద్యార్థి, యువజ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.