Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో జరిగిన ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు దేశాన్ని అభ్యుదయ మార్గం వైపు నడిపిస్తాయనీ, వాటిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. సామాజిక స్పృహ పెంపొంది అది వ్యక్తిగత జీవితానికి, సమాజంలో శాంతియుత వాతావరణానికి దిక్సూచిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ, దేశ శాంతి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. కులాలు, మతాల పేరిట విద్వేషాలను పెంచి పోషిస్తున్న పార్టీలు, కుహనా జాతీయవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు కేవీ.ఎల్, బొమ్మగాని ప్రభాకర్, డాక్టర్ సుధాకర్, తిప్పర్తి యాదయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.