Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో ప్రగతి భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఏఐవైఎఫ్ కార్యాలయంలో యువజన, విద్యార్ధి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర, నిర్లకంటి శ్రీకాంత్ (ఏఐవైఎఫ్)..కోట రమేష్, అనగంటి వెంకటేష్ (ఢవైీఎఫ్ఐ)..సలీం పాషా (వైజేఎస్)..లక్ష్మణ్, రెహ్మాన్, ఉదరు(ఏఐఎస్ఎఫ్)...అరుణ్ కుమార్(విజేఎస్) మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) నిర్వహించిన దేహదారుఢ్య అర్హత విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు అర్హత పొందారని తెలిపారు. అయితే బోర్డు చైర్మెన్ తప్పుడు నివేదిక విడుదల చేశారని విమర్శించారు.గతంలో ఈవెంట్స్ విభాగాలలో 87 శాతం మంది అభ్యర్థులు ఉతీర్ణత సాధించారని చెప్పిన అధికారి, ఇప్పుడేమో 53.7 శాతం మంది మాత్రమే అర్హత పొందారని చెప్పడం హేయమైన చర్య అని విమర్శించారు. చైర్మెన్ ఏకపక్ష నిర్ణయాలతో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఆకాంక్షలతో పోలీసు ఉద్యోగాన్ని పొందాలనే అభ్యర్థులకు ఆయన చేసిన ప్రకటన నష్టాన్ని కలిగిస్తున్నదన్నారు.రన్నింగ్ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులకు సివిల్, కమ్యూనికేషన్, ఫైర్, జైల్, ఎక్సైజ్ విభాగాల్లో మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలలో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులను కలపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని చైర్మెన్ పై చర్యలు తీసుకోవాలనీ, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే అనేక రోజులుగా అభ్యర్థులు వివిధ రూపాల్లో న్యాయం కోసం పోరాటం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం లో చలనం రాలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.