Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉచిత విద్యుత్ పథకం ఎల్టీ 4కు మారుస్తామని రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ముద్రించిన క్యాలెండర్‌ను ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా వృత్తిదారుల సమస్యలను ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మంత్రికి వివరించారు. ఉచిత విద్యుత్ పథకం ఎల్టీ 2లో ఉండటం వల్ల యూడీసీ చార్జీలు, సర్ చార్జీలు, యూజర్ చార్జీల భారం పడుతున్నదని తెలిపారు. మరో పక్క బిల్లులు చెల్లించాలంటూ సంబంధిత అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. రజకుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవోలను తెలంగాణ ప్రభుత్వానికి మార్పులు చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో రజకుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన జీవోలను తెలంగాణకు మారుస్తామని తెలిపారు. విద్యుత్ బిల్లులు రజకులు చెల్లించాల్సిన అవసరం లేదని విద్యుత్తు అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కొండపాక ఎంపీపీ ర్యాగల సుగుణ దుర్గయ్య , సిద్దిపేట స్థానిక కౌన్సిలర్ భుంపల్లి శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, రాష్ట్ర సహాయ కార్య దర్శులు సి మల్లేష్, జ్యోతి, ఉపేందర్ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం రాములు పెండ్యాల సంజీవ, సిహెచ్ నాగేష్, ఎస్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.