Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యుయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సబ్సిడీ బియ్యం ఎత్తివేయడం రాజ్యాంగ హక్కును కాలరాయడమేనని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యుయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరికీ కూడు గుడ్డ నివాసం అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని చెప్పారు. సబ్సిడీ బియ్యాన్ని రద్దు చేయడం అంటే ఆహార భద్రత చట్టం తోపాటు నిరుపేదలు జీవించే హక్కును హరించడమేనని చెప్పారు. డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు షరతులను మోడీ ప్రభుత్వం యధావిధిగా అమలు చేస్తున్నదని తెలిపారు. పేదలకు అందించే సబ్సిడీల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలనే షరతును యధావిధిగా అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడిందని వివరించారు. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా బతుకుతున్న కోట్లాదిమంది నిరుపేదల కుటుంబాలను ఆత్మహత్యల వైపు పురికొల్పే ప్రమాదం ఉందన్నారు.
ఎంఆర్ఓ,ఎండీఓ కార్యాలయాల ముందు నిరసనలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా అమలు చేసే ఆలోచన నుండి వెనక్కి తగ్గాలనీ, సబ్సిడీ బియ్యాన్నీ, ఉచిత బియ్యాన్ని యదాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమ, మంగళ వారాల్లో ఎంఆర్ఓ, ఎండీఓ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు పిలుపునిచ్చారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య అధ్యక్షత వహించారు.