Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి
- బాక్సర్ నిఖత్‌కు రూ.5 లక్షల ప్రోత్సాహకం
నవతెలంగాణ-హైదరాబాద్ :
అబ్బాయిలు ఆడే ఆట అని తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. అడ్డంకులు ఎన్ని వచ్చినా ఆమె సాధన ఆపలేదు. కఠోర శ్రమతో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ దేశానికి గర్వకారణమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్, ఇటీవల జాతీయ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకం సాధించిన నిఖత్ జరీన్‌కు గతంలో రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం క్లబ్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నిఖత్ జరీన్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేశారు. 'నిఖత్జరీన్ను చాంపియన్‌గా తీర్చిదిద్దిన ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ దేశానికి గర్వ కారణం. ప్రపంచ శ్రేణి సదుపాయాలతో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్థలం కేటాయించాలి. జనవరి 26 లోగా గ్రూప్-1 అధికారిగా నిమమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాను. నిఖత్ జరీన్‌ను ప్రోత్సహించేందుకు ఈ నగదు బహుమానం అందించాం. రాజకీయాలకు అతీతంగా ఉండాలనే నిజాం క్లబ్లో సన్మానం ఏర్పాటు చేశాం. క్రీడల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవసరం. లక్షలాది మంది క్రీడాకారుల్లో స్ఫూర్తి రగిల్చేందుకు నిఖత్ జరీన్‌కు మరో సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలని' రేవంత్ రెడ్డి అన్నారు. సన్మాన కార్యక్రమంలో నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు మొహమూద్ అజహరుద్దీన్ సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.