Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా సాధికారత, ఉపాధి, నిరక్షరాస్యత నిర్మూలన, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప పోరాటయోధురాలు గీతాముఖర్జి అని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ కొనియాడారు. ఆదివారం హైదరాబాద్లోని రాజ్బహదూర్గౌర్ హాల్లో గీతాముఖర్జీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ..నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా పనిచేశారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేయాలని తన మంత్రి పదవిని పరిత్యజించారని గుర్తుచేశారు. మహిళలు కుటుంబ, సాంఘిక, రాజకీయ హక్కులను కలిగినప్పుడు మహిళల మనుగడ అభివృద్ధి సాధ్యమని ఆనాడే ఆమె కొట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి సాంఘిక, ఆర్థిక రంగాలలో మార్పు కోసం విస్తృతమైన పోరాటాలను ఆమె చేశారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో ఆమె చేసిన వాదనలు, పోరాటం దేశవ్యాప్తంగా మహిళలకు ఉత్తేజాన్ని నింపిందన్నారు. నేడు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా, మహిళా సమస్యల పరిష్కారం కోసం ఆమె స్ఫూర్తితో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాఊ అధ్యక్షులు సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి. వర్కింగ్ ప్రెసిడెంట్. సదాలక్ష్మి,. ఏఐవైఎఫ్ జాతీయ. కార్యదర్శి ఎం.అనిల్, రాష్ట్ర అధ్యక్షులు వలి, నాయకులు గోవింద్, దశరథ్, శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ కరుణ కుమారి, నాయకులు ఎమ్డీ ఫైమిదా, జ్యోతిశ్రీమాన్, రొయ్యల గిరిజ, ఉజ్జిని హైమావతి, కమల, మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.