Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడవ రోజుకు చేరిన ఔట్ సోర్సింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె
నవతెలంగాణ-ఖమ్మం
మూడేండ్లుగా తమకు రావాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న హాస్టల్ డైలీవేజ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె ఆదివారం మూడవరోజుకు చేరుకుంది. ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్ట్టీ రోడ్ గిరిజన హాస్టల్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు నర్రా రమేష్, కాంపాటి వెంకన్న మాట్లాడుతూ.. జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. చివరికి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెట్టి కుటుంబాలను నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే కార్మికులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయం పేరుతో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తే సోమవారం వారిని అడ్డుకుంటామని తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు వీళ్ళ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, బాదావత్ లక్ష్మ, సంతోష్, లక్ష్మి దేవి, వీరమ్మ, మెహాన్, గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.