Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్త
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేయడంలోనే కాకుండా సామాజిక సేవల్లో కూడా ముందుంటారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలోని ఘట్టయ్య సెంటర్ జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఐవీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వాసవి క్లబ్ ఏడో జిల్లా క్యాబినెట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొని శ్రీనివాసగుప్తను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాసగుప్త మాట్లాడుతూ.. అన్ని కులాల, మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే ఉందని తెలిపారు. రైస్ మిల్లు, కిరాణం, వస్త్ర తదితర వ్యాపారులలో కొనసాగుతూ గుడి, బడి, అన్నదానం తదితర సామాజిక సేవ ల్లోనూ ముందుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమట్లతో సోపతి చేయమని అంటారని గుర్తు చేశారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ సివిల్ చదువుతున్న 23 మందికి ఒక లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగిందని వివరించారు. కరోనా కష్టకాలంలో కూడా బయటకు వచ్చి పేదలకు సహాయం చేస్తూ ఆహారాన్ని అందించినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింపచేస్తున్న సీఎం కేసీఆర్ అన్ని కులాల వారికి అందించిన విధంగానే ఆర్యవైశ్య పేదలకు కూడా అన్ని పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాతో అన్ని రకాల వ్యాపారస్తులు ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. 75 ఏండ్ల చరి త్రలో ఆర్యవైశ్యులకు జరగని న్యాయం ఈ ఎనిమిదేండ్లలో జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ నాయకులు యాద నాగేశ్వరరావు, పాలకుర్తి గాయత్రి, దోసపాటి వెంకటేశ్వరరావు, ద్వారా మల్లికార్జునరావు, ఐబీఎఫ్ నాయకులు, ఆర్యవైశ్య ఆయా కమిటీల కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.