Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్, వాచ్మెన్ తొలగింపు
- ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థుల హర్షం
నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, అటెండర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు చేస్తున్న పోరాటం ఫలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాల గ్రామంలో ఏకలవ్వ గురుకుల పాఠశాల (బాలికలు) ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వాచ్మెన్ రామస్వామిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్టు కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న ప్రకటించారు. కాగా, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావుకు ప్రిన్సిపాల్‌గా పూర్తి అదనపు బాధ్యతులు తీసుకోనున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఏకలవ్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్మెన్ తమను వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తెల్లవారుజామున 5గంటలకు కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. ఆహారంలో పురుగులు, వానపాములు రావడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వార్డెన్, ప్రిన్సిపాల్‌ను అడిగితే తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. వాచ్మెన్ రామస్వామి మద్యం సేవించి తమపట్ల అసభ్యకరంగా, దురుసుగా ప్రవరిస్తున్నాడని అన్నారు. వార్డెన్ రమ్య ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పారు. దీనిపై పూర్తి విచారణ చేసి ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, వాచ్మెన్ రామస్వామిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు వారికి వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఎస్ఐ శేఖర్ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.