Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవోల ద్వారా ప్రతిపక్షాల నియంత్రణ అప్రజాస్వామ్యం
- రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీని మించి అరాచక పాలన సాగుతున్నదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల, ప్రజా సంఘాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ప్రజా స్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రెండున్నర గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. తాజా గా ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 ద్వారా కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పవన్ తప్పుపట్టారు. ఈ ఘటనను పవన్‌కళ్యాణ్ ఖండించారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా విలేకర్లతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కుప్పంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై చర్చించేందుకే చంద్రబాబు నాయుడిని కలిసినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నదన్నారు. ప్రతిపక్షాల హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పంలో తన పర్యటనను అడ్డుకున్న వైసీపీ ప్రభుత్వం...అంతకుముందు వైజాగ్‌లో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారని అన్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు, వైజాగ్, తిరుపతి పర్యటనలకు వెళ్లిన సమయంలో తనను గతంలో ఎలా అడ్డుకున్న విషయాన్ని తెలిపారు. రాజధాని ప్రాంతంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళితే వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తే...వాటిని కూడా డీజీపీ నాడు సమర్థించారని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ప్రశ్నిస్తే...పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై...
ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశంపై స్పందిస్తూ, తెలంగాణ వాదం వదిలేసి వస్తున్నారు కనుక తప్పులేదన్నారు. ఏ పార్టీలోకి అయినా చేరికలు సహజమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.