Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిర్పూర్లో 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
- ఈ ఏడాది ఇదే అత్యల్పం!
- 31 జిల్లాలో 11 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని చలి వణికిస్తున్నది. మరో మూడు రోజులు చలితీవ్రత ఎక్కువగా ఉండనున్నదనీ, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్యం నుంచి చల్లనిగాలులు రాష్ట్రంమీదుగా వీస్తున్నాయనీ, దీంతో చలి తీవ్రత పెరిగిందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో అత్యల్పంగా 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్, ప్రణాళికా సంస్థ(టీఎస్డీపీఎస్) తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఇదే అత్పల్పం. రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ఎయిర్పోర్టులో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలకుగానూ 31 జిల్లాల్లో పలుప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల లోపే నమోదయ్యాయి. దీనినిబట్టే రాష్ట్రంలో చలితీవ్రత ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉదయం 10 దాటినా చల్లని గాలులు వీస్తుండటంతో ఇంటి తలుపులు తీయలేని పరిస్థితి నెలకొంది. అనివార్యంగా ఉదయం పూట ఆవసరాలు, ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లే వారు చలితో వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, అస్తమా వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిర్పూర్(యు) (కొమ్రంభీమ్ అసిఫాబాద్) - 4.7 డిగ్రీలు
కెరమెరి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) - 5.7 డిగ్రీలు
తిర్యాణి (కొమ్రంభీమ్ అసిఫాబాద్) - 6.2 డిగ్రీలు
కవ్వాల పులుల అభయారణ్యం (మంచిర్యాల) - 6.7 డిగ్రీలు
వాంకిడి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) - 7.1 డిగ్రీలు
బేల(ఆదిలాబాద్) - 7.2 డిగ్రీలు
ర్యాలి(మంచిర్యాల) - 7.2 డిగ్రీలు
శివంపేట(మెదక్) - 7.2 డిగ్రీలు
బజార్హత్నూర్(ఆదిలాబాద్) - 7.3 డిగ్రీలు
జన్నారం(మంచిర్యాల) - 7.4 డిగ్రీలు