Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంగారెడ్డి జిల్లాలో ఘటన.. ముగ్గురు మృతి
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ యూనిట్-1 పరిశ్రమలో ఆదివారం జరిగింది. బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమలోని వేర్ హౌస్‌లో ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన లోకేశ్వర్‌రావు(38) అసిస్టెంట్ మేనేజర్‌గా, పశ్చిమ బెంగాల్‌కి చెందిన పరితోష్ మెహతా(40), బీహార్‌కి చెందిన రంజిత్ కుమార్(27) కార్మికులుగా పనులు చేస్తున్నారు. అయితే ఆదివారం టెట్రా మిథైల్ డిసిలోక్సిన్ అనే రా మెటీరియల్ భద్రపరుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.