Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షక శక్తి ఏకం కావాలి
- మోడీ సర్కార్ దుర్మార్గాలను ప్రజలకు వివరించండి
- ఏప్రిల్ 5న మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ జయప్రదం చేయండి : సీఐటీయూ, రైతుసంఘం, వ్య.కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సులో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కార్మికులు, కర్షకులు ఏకం అయ్యి ప్రజాక్షేత్రంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పలువురు నాయకులు చెప్పారు. ఏప్రిల్ 5వ తేదీ డిల్లీలో జరిగే మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం అన్ని సంఘాలు ప్రజల్ని నేరుగా కలిసి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు, వాటి దుష్పరిణామాలను వివరించాలని సూచించారు. సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్, ఆలిండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎమ్ సాయిబాబు ప్రధాన వక్తలుగా మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయాలేదని చెప్పారు. నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ ప్రకారం అధికారికంగా దేశంలో నాలుగులక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు వంటి వారి ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కలేదనీ, అవి ఇంతకు రెట్టింపు ఉన్నాయని వివరించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా తేకుండా, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే మూడు నల్ల చట్టాలను తెచ్చే ప్రయత్నం చేశారని వివరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఆ నల్లచట్టాల్ని వెనక్కి తీసుకోక తప్పలేదనీ, అయితే ఇప్పుడు వాటిని మరో రూపంలో అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. సుదీర్ఘకాలం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారని గుర్తుచేశారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజలకు దగ్గర అవుతున్నదనీ, ఆ ఎర్రజెండాను చూస్తే, బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నదనీ చెప్పారు. ఢిల్లీ రైతాంగ పోరాటం స్ఫూర్తితో మహారాష్ట్రలో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం మెడలు వంచి, అక్కడి కార్మికవర్గం విజయం సాధించిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం సంపద సృష్టికర్తలైన కార్మికులు, కర్షకులు, వ్యవసాయకూలీలపై యుద్ధం చేస్తున్నదనీ, దేశాన్ని బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నాలను ఆమోదించబోమని హెచ్చరించారు. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పేరుతో కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల రుణాలను కేంద్రం రద్దుచేసిందన్నారు. విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోమని హామీ ఇచ్చిన మోడీ సర్కారు ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్ల అనుకూల విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పేరుతో అదానీ, అంబానీల సేవలో తరిస్తున్నదని అన్నారు. ఇప్పుడు వారి దృష్టి దేశంలోని ప్రకృతి సహజ సంపదపై పడిందనీ, అడవులను కూడా వారికి కట్టబెడుతున్నారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమికి అక్కడి యాపిల్ రైతులు కారణమయ్యారని విశ్లేషించారు. చలో ఢిల్లీకి వెళ్తున్న మూడు సంఘాల ఐక్యత మండల, గ్రామస్థాయిల్లోకి తీసుకెళ్లాలనీ, ప్రజల్ని వాటిలో భాగస్వాముల్ని చేయాలని పిలుపునిచ్చారు. సదస్సుకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ నాగయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అధ్యక్షత వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, చలో ఢిల్లీ కార్యాచరణను వివరిస్త్తూ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం సభికులు చేతులెత్తి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రమ, పద్మ, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రజిత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ కార్యాచరణ
- ఫిబ్రవరి 10వ తేదీ లోపు జిల్లా సదస్సులు
- ఫిబ్రవరి 28లోపు మండల స్థాయి సదస్సులు
- మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు గ్రామస్థాయిలో పాదయాత్రలు
- మార్చి 10 నుంచి 25 వరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జీపు, బస్సు జాతాలు