Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలో ప్రగతిభవన్ ఉద్రిక్తత
- నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
- సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి : పోరాట సమితి కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన చలో ప్రగతిభవన్ విజయవంతమైంది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు కదిలారు. అయితే, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా కార్యక్రమం విజయవంతం అయిందని పోరాట సమితి నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజన, విద్యార్థి సంఘాల నేతలను.. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను సుమారు 1000మందిని అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి పిలుపు నిచ్చింది. ప్రగతి భవన్‌కు ర్యాలీగా తరలిన నేతలను హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గోషామహల్ స్టేడియానికి వెళ్లి అక్కడ యువజన, విద్యార్థి సంఘాల నేతలను, అభ్యర్థులను పరామర్శించారు. అరెస్టులను తీవ్రంగా ఖండించారు. పోలీస్ అభ్యర్థుల ఎంపిక పద్ధతిలో తప్పులను సవరించి న్యాయం జరిగేలా చూడాలని చేపట్టిన చలో ప్రగతిభవన్‌కు వెళ్లకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో యువజన, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నేతలు కాలంగి హరికృష్ణ, బయ్య అభిమన్యు, పరిటాల వేణు, హైమద్, గణేష్‌ను అరెస్టు చేశారు. దమ్మపేటలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి, ఏఐవైఎఫ్ దమ్మపేట మండల కార్యదర్శి సుంకు పాక ధర్మను ముందస్తుగా అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డీవైఎఫ్ ఐ, ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు తెల్లవారుజామునే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో యూత్ కాంగ్రెస్ నాయకులను, మండల కేంద్రంలోని బస్టాండ్‌లో డీవైఎఫ్ ఐ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో చెన్న రాజేష్, బోనగిరి గణేష్,గాడిపల్లి ప్రశాంత్, పాసికంటి ఉదరు ఉన్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో పీడీఎస్‌యూ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్‌కుమార్ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, నాయకులకు పోలీసులు అరెస్టు చేసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
నారాయణపేట్‌లో ఎస్ఎఫ్ఐ నాయకులు శశికిరణ్, నరేష్, పవన్ కుమార్, వెంకటేష్, శ్రీనివాస్‌ను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు. అచ్చంపేటలో జిల్లా అధ్యక్షులు వర్ధం సైదులును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.ఈ సందర్భం గా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర బాధ్యులు కె.ధర్మేంద్ర, నిర్లకంటి శ్రీకాంత్, సత్య ప్రసాద్(ఏఐవైఎఫ్), అనగంటి వెంకటేష్, జావీద్ (డీవైఎఫ్ఐ), సలీంపాషా (వైజేఎస్), రెహ్మాన్, ఉదరు(ఏఐఎస్ఎఫ్), నాగరాజు, అశోక్‌రెడ్డి, సునీల్ (ఎస్ఎఫ్ఐ), అరుణ్ కుమార్ (విజేఎస్), శ్రీకాంత్ (నిరుద్యోగ జాక్) మాట్లా డారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ ఎల్పీఆర్బీ) వల్ల ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా పోరాటాలు నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల పట్ల ఉదాసీనత చూపించకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరి ష్కార పోరాట సమితి బాధ్యులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. సత్వరమే ఉన్నత స్థాయి కమిటీని నియమించాలన్నారు. ఎస్ఐ, కానిస్టేబు ల్ అభ్యర్థులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, పోరాటం చేసి సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు.
రెండ్రోజుల పోలీసుల నిర్బంధంలో కోట
ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో 800/1600 అర్హత సాధించిన వారందరికీ మెయిన్స్‌లో అవకాశం కల్పించాలనీ, కానిస్టేబుల్ పరీక్షలో ఏడు మార్కులు కలపాలని డిమాండ్‌చేస్తూ యువజన, విద్యార్థి సంఘాలు ప్రగతిభవన్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నాయకులను పోలీసులు ముందస్తు గానే అరెస్టు చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌ను ఆదివారమే అదుపులోకి తీసుకుని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రెండు రోజుల పాటు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు.