Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- ఆర్టీసీ 'జీవా' వాటర్ బాటిళ్లను విడుదల చేసిన మంత్రి
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
టీఎస్ ఆర్టీసీ ప్రజల ఆస్తి అని, పేద, మధ్య తరగతి వాళ్లు వినియోగించే ఈ సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రయివేటుపరం చేయబోదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్ 'జీవా' వాటర్ బాటిళ్లను సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, టీ.ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్‌తో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నీళ్లను రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఏటా టీఎస్ఆర్టీసీ 90 లక్షల లీటర్ల వాటర్ బాటిళ్లను బయట నుంచి కొని వినియోగించడం జరుగుతోందని, ఇక ఆ పరిస్థితి ఉండదన్నారు. టీఎస్ఆర్టీసీలో దాదాపు 50 వేల మంది సిబ్బందిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోందని చెప్పారు. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత 20 నుంచి 25 డిపోలను లాభాల బాటలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో అన్ని డిపోలు లాభాల్లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ 9 వేల బస్సులు 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 30 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చుతోందని వివరించారు. టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్‌తో మార్కెట్లోకి వస్తున్న స్వచ్ఛమైన తాగునీరు 'జీవా'ను ప్రజల ఆదరించాలని మంత్రి కోరారు. టీఆర్అండ్బీ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. తాగునీటి వ్యాపారంలోకి టీఎస్ఆర్టీసీ ప్రవేశించడం గొప్ప ఆలోచన అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీకి రెవెన్యూ 96 శాతం టికెట్ల ద్వారానే వస్తోందన్నారు. గతంలో కన్నా ఆక్యూపెన్సీ రేటు ఇప్పుడు పెరిగిందని.. అయినా ఇంకా సాధించాల్సి ఉందన్నారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నామని తెలిపారు. కార్గో సేవల ద్వారా మూడేండ్లలో రూ.200 కోట్ల రాబడి వచ్చిందని.. 34 పెట్రోల్ బంకుల ద్వారా రోజుకు రూ.90 లక్షల బిజినెస్ నడుస్తోందని వెల్లడించారు. త్వరలోనే 250 ఎం.ఎల్, అర లీటర్ బాటిళ్లను మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ వృద్ధికి సహకరిస్తున్న హన్సా ఈక్విటీ పార్ట్నర్ ఎల్ఎల్పీ త్రినాధ్బాబును అభినందించారు. జీవా వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకురావడంలో తమవంతు కృషి చేసిన సంస్థ ఉన్నతాధికారులు ప్రస్తుత సి.పి.ఎం కృష్ణకాంత్, సి.టి.ఎం (ఎంఅండ్‌సి) విజయకుమార్, చీఫ్ స్ట్రాటాజీ ఆఫీసర్ విప్లవ్, ఎస్.ఒ శ్రవంత్ తదితరులను సన్మానించి వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, పురుషోత్తం, యాదగిరి, వినోద్‌కుమార్, సీటీఎం జీవన్ ప్రసాద్, రేగుల సునీల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.