Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి
- వేగంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- కోహిర్లో 4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత
- 31 జిల్లాల్లో పదిడిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చలి వణుకు పుట్టిస్తున్నది. ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. 31 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. ఆ జిల్లాలన్నీ ఆరెంజ్ హెచ్చరిక జాబితాలో ఉన్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతల కంటే ఒకేసారి మూడు నుంచి ఐదు డిగ్రీల మేర పడిపోయాయి. ఉదయం పది దాటినా చలితీవ్రత మాత్రం తగ్గడం లేదు. దీంతో ఇంటి తలుపులు తీయలేని పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇదే అత్యల్పం కావడం గమనార్హం. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు(ఆరు డిగ్రీల లోపు) నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు చలితీవ్రత ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ మీదుగా కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయనీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చల్లని గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆస్తమా, శ్వాసకోసవ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
కోహిర్(సంగారెడ్డి) -4.6 డిగ్రీలు,సిర్పూర్(యూ) (కొమ్రంభీం అసిఫాబాద్) -4.8 డిగ్రీలు,మర్పల్లి(వికారాబాద్)- 5.0డిగ్రీలు, తాళ్లపల్లి (రంగారెడ్డి)-5.0 డిగ్రీలు, మంగల్‌పల్లి(రంగారెడ్డి)- 5.2 డిగ్రీలు,బజార్హత్నూర్(ఆదిలాబాద్)- 5.4 డిగ్రీలు డోంగ్లి(కామారెడ్డి) -5.5 డిగ్రీలు శివంపేట్(మెదక్)-5.6 డిగ్రీలు, న్యాల్కల్(సంగారెడ్డి) -5.6 డిగ్రీలు,నల్లవెల్లి(సంగారెడ్డి)-5.7 డిగ్రీలు.