Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనవసర సి సెక్షన్లు తగ్గించేందుకు సిబ్బంది కృషి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సోమవారం టీవీవీపీ ఆస్పత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ సిబ్బంది మర్యదగా ప్రవర్తించాలని కోరారు. పేషెంట్లు, అటెండర్లతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రులపై పెరిగిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. అనవసర సి సెక్షన్ల వల్ల కలిగే నష్టాన్ని కౌన్సిలింగ్ ద్వారా వివరించాలని కోరారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో పేషెంట్లకు వార్డుల్లో కిటికీలు, తలుపులు సరిగ్గా ఉన్నాయా లేదా చూడాలని ఆదేశించారు. మందులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రిఫర్ చేయకూడదని, డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.