Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రభుత్వ వాదనలు
నవతెలంగాణ-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన అప్పీల్ పిటిషన్లపై సోమవారం డివిజన్ బెంచ్ ముందు వాదప్రతివాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారంజీలతో కూడిన ధర్మాసనం ఎదుట సీనియర్ లాయర్ దుష్యంత్ దవే రాష్ట్ర ప్రభుత్వ వాదనలను వినిపించారు. అనేక కేసుల్లో కేసు వివరాలు బయటకు వచ్చాయనీ, మీడియాలో రావడం సర్వసాధారణమని ఆయన బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. సిట్ దర్యాప్తును క్వాష్ చేయాలని ఎవ్వరూ కోరనప్పుడు క్రిమినల్ కేసులో అప్పీల్చేసినట్టు కాదన్నారు. ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయవచ్చునని చెప్పారు. అనూహ్య పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే కేసు దర్యాప్తును రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుందన్నారు. సిట్ దర్యాప్తు లోతుగా జరుగుతున్నందున సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటన అక్టోబర్ 26న జరిగితే ఆ తర్వాత నవంబర్ మూడో తేదీన సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహించారనీ, ఈ మధ్యకాలంలోనే హైకోర్టులో రిట్ కూడా దాఖలు అయ్యిందని తెలిపారు. ఈ కేసులో పోలీసులే సాక్ష్యులనీ, వాళ్లే విచారణ అధికారులని వాళ్లే ఫిర్యాదుదారులనీ, అంతా ఏకపక్షంగా జరుగుతోందని నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది ఉదరు హౌళ్లా వాదించారు. నోటీసు ఇవ్వడానికి తన పిటిషనర్ శ్రీనివాస్ ఇంటికి ఏకంగా 30 మంది పోలీసులు దండయాత్రలాగా వచ్చారనీ, 41ఏ నోటీసులను ఇంటికి అతికించి నేరం చేసినట్లుగా పత్రికల్లో ప్రచారం చేశారని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయనేమీ నిందితుడు కూడా కాదన్నారు. బండి సంజరు, బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని సిట్ తీవ్ర వేధింపులకు గురిచేసిందన్నారు. అక్టోబర్ 26న ఫాం హౌజ్‌లో ఘటన జరిగితే ఆ తర్వాత రోజు తేదీతో పంచనామా రిపోర్టు ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. శ్రీనివాస్ ఏమీ దావూద్ ఇబ్రహీం కాదని వ్యాఖ్యానించారు. నోటీసు ఇంటి గోడపై అతికించి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచారం చేయించారని తప్పుపట్టారు. మరో సీనియర్ న్యాయవాది సంజరు వాదిస్తూ, అప్పీల్ దాఖలు చేసే పరిధి హైకోర్టుది కాదన్నారు. క్రిమినల్కేసులో అప్పీల్ సుప్రీంకోర్టులో దాఖలు చేయాలన్నారు. తదుపరి వాదనలను బెంచ్ మంగళవారానికి వాయిదా వేసింది.