Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగునీటి కోసం బోర్లు వేసి అప్పుల పాలు
నవతెలంగాణ-లింగంపేట్
పంట పండించేందుకు సాగునీటి వసతి లేక బోర్లు వేయించగా.. అవి పడకపోవడంతో అప్పుల పాలై తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బోనాల గ్రామంలో సోమవారం వెలుగుజూసింది. ఎస్ఐ శంకర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కప్ప సంగయ్య (45)కు గ్రామ సమీపంలో 1.20 ఎకరాల భూమి ఉంది. ఇందులో పంట సాగు చేసుకోవడానికి సాగునీరు లేకపోవడంతో గతేడాది అప్పులు చేసి మూడు బోర్లు వేశారు. అయినా నీళ్లు పడలేవు. ఒక్క బోరులో కొంచెం నీరు రావడంతో బోరు మోటర్ బిగించి పైప్ లైన్లు బిగించారు. ఇందుకోసం దాదాపు రూ.4 లక్షలకు పైగా అప్పయింది. ప్రస్తుతం ఆ బోరూ ఎత్తిపోవడంతో సంగయ్య తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. ఒక వైపు అప్పులు పెరిగిపోతుండగా.. పంట పండించేందుకు ఉన్న బోరు వట్టిపోవడంతో ఆవేదనకు గురైయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇంటిపెద్దను కోల్పోవడంతో కుటుంబీకుల రోదనలు అక్కడున్నవారిని కలిచివేశాయి.