Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీసాక్స్లో విచిత్ర పరిస్థితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులను అవసరాల రీత్యా ఆయా శాఖలకు డిప్యూటేషన్ పై పంపిస్తుంటారు. అక్కడ అవసరం తీరాక తిరిగి మాతృసంస్థల్లో వారి సేవలను వినియోగించుకుంటుంటారు. ఇది ప్రభుత్వ శాఖల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే కొందరి విషయంలో మాత్రం డిప్యూటేషన్‌పై వెళ్లినా ...అక్కడే తిష్ట వేసుకుని ఉండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీసాక్స్)లో ఉద్యోగుల మధ్య చర్చకు దారి తీసింది. ఈ సంస్థలో ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై అదనపు ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న అధికారి మాతృసంస్థ డైరెక్టర్ ఆఫ్ హెల్త్. ఆమెను తిరిగి మాతృసంస్థలో చేరేలా టీసాక్స్ నుంచి రిలీవ్ చేయాలని గతేడాది అక్టోబర్ 13న రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు టీసాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఆ లేఖకు సమాధానంగా ఈ ఏడాది జనవరి నాలుగున డిప్యూటేషన్‌పై ఉన్న ఏపీడీ డాక్టర్ జి.అన్న ప్రసన్న కుమారిని రిలీవ్ చేస్తూ ప్రాజెక్టు డైరెక్టర్ డీహెచ్‌కు లేఖ రాశారు. ఆ రిలీవ్ కూడా తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. తదుపరి పోస్టింగ్ ఆర్డర్స్ కోసం డీహెచ్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇలాంటి సందర్భాల్లో సదరు ఉద్యోగి అందుబాటులో ఉంటే 24 గంటల్లో పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని జాయిన్ కావడం, అందుబాటులో లేకుండా దూర ప్రాంతంలో ఉంటే మూడు రోజుల్లో జాయిన్ కావడం జరుగుతుంది. అయితే ఆదేశాలు వచ్చే నాటికి సదరు ఉద్యోగి ఢిల్లీలో ఉండటం, మరునాడు హైదరాబాద్ వచ్చినా ..నర్సులకు సంబంధించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. అదే రోజు కార్యాలయానికి వచ్చిన ఆమెకు టీసాక్స్ ఏఓ రిలీవ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ తీసుకోకుండా నిరాకరించినట్టు సమాచారం. ఆ తర్వాత శుక్రవారం మరోసారి ఆమె పీడీతో సమావేశం అయి చెన్నైలో జరుగనున్న ఆల్ ఇండియా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమావేశంలో టీసాక్స్ తరపున పాల్గొనేందుకు వెళ్లినట్టు తెలిసింది. మాతృసంస్థకు పంపించాలని డీహెచ్ రాసిన లేఖ రాయడం, దానికి సమాధానమిచ్చేందుకు దాదాపు మూడు నెలలు పట్టడం, తీరా రిలీవ్ చేసినా జాయిన్ కాకుండా కాలయాపన చేయడం వంటి చర్యలపై ఉద్యోగుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి రిలీవ్ అయిన తర్వాత తిరిగి అదే ఉద్యోగిని వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమావేశానికి పంపించాల్సిన అసరమేముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆ బాధ్యతలను ఇతర ఉద్యోగులకు అదనంగా అప్పగించే అవకాశమున్నప్పటికీ రిలీవ్ అయిన ఏపీడీకే అప్పగించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, టీసాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు.