Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేస్తామంటూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, దాన్ని అమలు చేయడంలో విఫలమైందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజ్జు కష్ణన్ విమర్శించారు. రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేట్టుగా చేస్తామన్న వాగ్దానాన్ని విస్మరించిందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులు బయట పడాలంటే, కనీస మద్దతు ధరల చట్టం చేయాలనీ, కేరళ తరహాలో రుణ విముక్తి చట్టం తేవాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘం రాష్ట్ర విస్తత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పాదకతను పెంచి గిట్టుబాటు ధరలు ఇవ్వాలన్నారు. కనీస మద్దతు ధరల ప్రకారం పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో సుమారు 52 పంటలుకు మద్దతు ధర ప్రకటించాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయనీ, కేవలం 23 పంటలకే ప్రకటించి కేంద్రం చేతులుదులపుకుంటున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో భారీగా కోతలు విధించిందన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉపకరణాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. అన్నదాతలు అప్పులు తీర్చలేక ప్రతి ఏడాది 12,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతాంగానికి ఆయా రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. జాతీయ స్ధాయిలో సరైన విత్తన చట్టం ఇంతవరకు లేకపోవడంతో కల్తీ విత్తనాల సమస్య తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కార్పొరేట్ కంపెనీలకు కోట్లు కురిపిస్తుండగా రైతాంగానికి ఏ విధంగానూ ఉపయోగపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. 2011 కౌలు చట్టం ప్రకారం కౌలు దారులకు రుణార్హత కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, మాదినేని రమేష్, బుర్రి శ్రీరాములు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, వర్ణ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, బొంతు రాంబాబు, దండ వెంకట్‌రెడ్డి, కున్రెడ్డి నాగిరెడ్డి, మాటూరి బాల్‌రాజ్‌గౌడ్, గఫూర్ పాషా, ఈసంపల్లి బాబు, రాపర్తి సోమయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, డి. బాల్‌రెడ్డి, యం శ్రీనివాసులు, పల్లపు వెంకటేశ్ పాల్గొన్నారు.