Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తమ సమస్యల పరిష్కారం కోసం చలో ప్రగతిభవన్ ఆందోళన నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. సమస్యల పరిష్కారం కోసం వారు రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత బోర్డు పట్టించుకోక పోవడంతో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడించారని తెలిపారు. ముందురోజు నుంచే వారిని అరెస్టులు చేశారనీ, ముట్టడిలో పాల్గొన్న అభ్యర్ధులు, నాయకులపై లాఠీచార్జి చేసి, చొక్కాలు చింపి, అరెస్టులు చేసి, అమానుషంగా ప్రవర్తించారని విమర్శిం చారు. ఈ చర్యల్ని తమ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని సోమవారం నాడొక ప్రకటనలో పేర్కొన్నా రు. అభ్యర్థుల కోర్కెలు న్యాయంగా పరిష్కరించ దగినవని చెప్పారు.ఉన్నత న్యాయస్థానం తీర్పును కూడా లెక్కచేయ కుండా తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపకుండా లక్షలాది మంది అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణం అభ్యర్థులు, యువజన సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులు దుర్మార్గం : ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ
రన్నింగ్‌లో క్వాలిఫై అయిన ఎస్.ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను మెయిన్స్‌కు అనుమతించాలని ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులు దుర్మార్గం, అర్ధరాత్రి ఇండ్లలో వెళ్ళి అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ రాష్ట్ర కమిటీలు ఖండించాయి. ఈ మేరకు సోమవారం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనంగటి వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన పోలీసు అభ్యర్ధులందరికి మెయిన్స్ అర్హత కల్పించాలని కోరుతూ గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం విద్యార్ధి ,యువజన సంఘాలు ఛలో ప్రగతిభవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. స్పందించకపోగా, ఆందోళనకు పూనుకున్న నాయకులను అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసి హైదరాబాద్ రాకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు.
పాత పద్దతుల్లో ఈవెంట్స్ నిర్వహించకపోవడం, రన్నింగ్ క్వాలిఫై అయినా ప్రధాన పరీక్షకు అనుమతించక పోవడం వంటి చర్యలతో చాలా మంది నిరుద్యోగులు తమ జీవితాలను నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లాలో పుప్పాల రవికుమార్ అనే అభ్యర్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర హొంమంత్రి, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్, డీజీపీ అభ్యర్థులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్ధి నాయకులను, ప్రగతి భవన్ ముట్టడిలో అరెస్ట్ అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల భవిష్యత్ పోరాటాలకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నిలబడతాయని మద్దతుగా నిలబడుతుందని స్పష్టం చేశారు.