Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్
నవతెలంగాణ- ముషీరాబాద్
ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉన్నదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరలోనే అద్దె బస్సుల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసీకి వారితో సంబంధాలను మరింత మెరుగుపరచడానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ఆర్టీసీకి 30 శాతం అద్దె బస్సులు సేవలందిస్తున్నాయని తెలిపారు. రాబోయే సంక్రాంతికి ప్రయాణికులకు మెరుగైన సేవలందించి సంస్థ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అబ్బ మధుకర్ రెడ్డి, వి.మహిపాల్ రెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు సర్వీసులో నడుస్తున్న ఆర్టీసీ అద్దె బస్సులకు సంస్థ చెల్లించే అద్దెలో కిలోమీటర్‌కు రూపాయి తగ్గించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం నాయక్, వినోద్ కుమార్, సంఘం గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్, ట్రెజరర్ సత్యంబాబు, అడిషనల్ సెక్రటరీ రామకష్ణారెడ్డి, బస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ.శ్రీనివాస్, టాటా మోటార్స్ ప్రతినిధి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.