Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన చైర్మెన్ బాజిరెడ్డి, ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ మినీ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రయోగాత్మకంగా తొలి విడతలో ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో కూడిన 'సైబర్ లైనర్' బస్సుల్ని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సోమవారం ప్రారంభించారు. ఈ బస్సుల్ని ప్రత్యేకంగా ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం డిజైన్ చేసినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. 18 సీట్లు ఉంటే ఈ మినీ బస్సులో వైఫై, జీపీఎస్, ట్రాకింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. మెట్రోరైల్‌కు అనుసంధానంగా రాయదుర్గం నుంచి వేవ్ రాక్, జీఏఆర్, డిఎల్ఎఫ్ ప్రదేశాలకు పైలెట్ ప్రాజెక్టుగా ఈ బస్సుల్ని నడపనున్నట్టు తెలిపారు. ఐటీ ఉద్యోగులు సొంత వాహనాల్లో వచ్చి డ్రైవింగ్, ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడేకంటే సైబర్ లైనర్ బస్సుల్లో ప్రయాణించడం సుఖవంతంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు రక్షణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పది బస్సులు పైలట్ ప్రాజెక్ట్‌గా నడుస్తాయనీ, వీటి ఆదరణను బట్టి మరిన్ని సర్వీసులు విస్తరిస్తామని వివరించారు. ఐటీ ఉద్యోగుల పని దినాల ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి 15 నిముషాలకొక సర్వీసు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు మునిశేఖర్, యాదగిరి, ఎల్‌అండ్‌టి సీఎస్ఓ మురళీ వరదరాజన్ తదితరులు పాల్గొన్నారు.