Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల విద్యార్థులను కలుపుకుపోవాలి
- ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమర్జింగ్ టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. అదే విధంగా ఐటీ కంపెనీలు బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల విద్యార్థులను కలుపుకుపోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును అధిగమించిందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్ నుంచే పని చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద ఇన్నోవేషన్ టి హబ్, మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్ , తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేశామనీ, త్వరలో దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైప్ సెంటర్ టి వర్క్స్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. అంతరిక్ష పరిశోధనా సంస్థలు, స్టార్టప్స్‌తో హైదరాబాద్ ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును చాలా సార్లు అధిగమించిందని గుర్తు చేశారు. టాస్క్ ద్వారా ఏడు లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పది లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే టి.ఫైబర్ ఈ ఏడాది పూర్తవుతుందని వెల్లడించారు. ప్రభుత్వ సేవల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఏ నగరంలో లేనట్టు త్వరలోనే హైదరాబాద్ నగరంలో సంపూర్ణ మురుగునీటి శుద్ధి వంద శాతం జరుగుతుందని తెలిపారు. రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ, ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ, మౌలిక సదుపాయా లను కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో 300 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తున్నదని తెలిపారు.