Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
- మంత్రికి ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధి బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామసభల్లో ఆమోదం పొందిన పోడు భూముల దరఖాస్తులన్నింటికీ యధావిధిగా హక్కుపత్రాలివ్వాలని తెలంగాణ ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం కాకుండా అటవీశాఖ తన సొంత నిబంధనలతో వేలాది దరఖాస్తులను తిరస్కరణకు గురి చేస్తున్నదని మంత్రికి నేతలు వివరించారు. పోడు భూములకు హక్కులొస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న గిరిజనులు, పేదలకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నదని వాపోయారు. రాష్ట్రంలోని 4.13 లక్షల మంది పోడు రైతులు 12.5 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కులు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం లక్ష మందికి మాత్రమే అంగీకరించి మిగిలిన 3.13 లక్షల మంది దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్టు తెలుస్తున్నదని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో 43 వేల దరఖాస్తులకు గాను 8వేలు, ములుగు జిల్లాలో 33,960 దరఖాస్తులకు 2,292, నల్లగొండ జిల్లాలో 2,046కు 1,500, అదిలాబాద్‌లో 241 గానూ 3,000, నాగర్ కర్నూలు జిల్లాలో 12,500 కు కేవలం 375 దరఖాస్తులను మాత్రమే అంగీకరించినట్టు తెలిసిందన్నారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాల స్థాయిలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పూర్తిగా చేతులెత్తేశారని తెలిపారు. చట్టాన్ని అటవీ శాఖ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పోడు రైతులు పెట్టుకున్న దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నదని వివరించారు. ఎనిమిదేండ్లుగా హరితహారం పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను బలవంతంగా లాక్కున్నదన్నారు. కొన్ని జిల్లాల్లో గ్రామ కార్యదర్శుల తప్పిదాల వలన హక్కు పత్రాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హక్కు పత్రాలను సైతం ఆన్లైన్లో పేర్లు ఎక్కించకుండా చేశారని తెలిపారు. దీంతో సర్వేలకు కూడా నోచుకోలేదన్నారు. వాస్తవ సాగుదారులకు హక్కులు రాకుండా చేశారన్నారు. వాస్తవ సాగులో ఉన్న భూమిని మొత్తం సర్వే చేయకుండా ఎకరం, అరెకరం సర్వే చేశారని తెలిపారు. ఐదెకరాలు సాగులో ఉంటే గత ప్రభుత్వం ఒక ఎకరా పోడు భూమికి హక్కు పత్రం ఇచ్చిందనే పేరుతో ఇప్పుడు హక్కు పత్రాలు ఇవ్వబోమని అధికారులు చెప్తున్నారని వివరించారు. గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ రవి నాయక్, భూక్యా వీరభద్రం ,తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్, కారం పుల్లయ్య, సుడి కృష్ణారెడ్డి, బాలునాయక్ తదితరులు ఉన్నారు.