Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాలకు డ్రైవర్లే బాధ్యులంటే ఎలా?
- డ్రైవర్లకు ఉరితాడులా మోటార్ వాహన చట్టం
- ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది
- ట్రాన్స్‌పోర్టు కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్
- కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్‌లో సాగిన 'సంఘర్ష' యాత్ర
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ హుజూరాబాద్ / వేములవాడ / సిరిసిల్ల
''కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం డ్రైవర్లకు ఉరితాడులా మారింది.. రోడ్లు బాగు చేయకుండా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకుండా ప్రమాదాలకు డ్రైవర్లనే బాధ్యులను చేయడం సరికాదు'' అని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య, ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీని పరిరక్షించాలని, ప్రతి మండల, జిల్లా కేంద్రంలో అడ్డా స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలపై చేపట్టిన 'సంఘర్ష' యాత్ర 9వ రోజుకు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి శంకరపట్నం మండల కేంద్రం మీదుగా అల్గునూర్, జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం వరకు వాహనాల ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం యాత్ర వేములవాడ, అక్కడి నుంచి సిరిసిల్లకు చేరుకుంది. ఆ తర్వాత ఎల్లారెడ్డిపేట, కామారెడ్డి మీదుగా రాత్రిక నిజామాబాద్‌కు చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో వీరయ్య, పుప్పాల శ్రీకాంత్ మాట్లాడారు.
ఉన్నత చదువులు ఉన్నా.. ఉద్యోగాలు దొరక్క రవాణా రంగంలో చాలా మంది స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. నిత్యం ప్రమాదాలకు గురై వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏండ్లు గడిచినా వీవీగిరి నేషనల్ ఇనిస్టిట్యూట్ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం అక్కడ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమానికి పాటుపడు తోందన్నారు. రాష్ట్రంలో కూడా ఆ తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోటార్ వాహన చట్టం, రవాణా రంగాన్ని సరళీకరణ చేయడంతో ప్రమా దాల రేటు తగ్గకపోగా పెరుగుతోందన్నారు. పెనాల్టీలు, కేసులు లాంటి చర్యలతో ప్రమాదాలను తగ్గిస్తామని సర్కారు చెప్పటం ఒక బూటకమని అన్నారు. కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే అనేక అంశాలు సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సుల సంఖ్య పెంచుతూ ఆర్టీసీ ప్రయివే టుపరం చేస్తున్నారని, మనందరమూ ఆ సంస్థను పరిరక్షించుకోవాలని కోరారు. ఆర్టీసీలో 2019 నుంచి కార్మిక ఉద్యమంపై రాష్ట్ర సర్కారు ఆంక్షలు విధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాని కంటే తామేమీ తక్కువ కాదన్నట్టుగావ్యవహరించిందని విమర్శించారు.
కార్యక్రమంలో సీఐటీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముకుందరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఉపాధ్యక్షులు యు.శ్రీనివాస్, గుడికందుల సత్యం, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి చెలికాని శ్రీనివాస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాజయ్య, కార్యదర్శి వీరగోని శ్రీనివాస్, ట్రాన్స్‌పోర్టు జిల్లా సహాయ కార్యదర్శి పుల్లెల మల్లయ్య, ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్డు వద్ద యాత్రకు నాయకులు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న యాత్రకు బోర్గాం వద్ద రవాణా రంగ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఘన స్వాగతం పలికారు. బోర్గాం నుంచి వినాయక్‌నగర్ మీదుగా పులాంగ్ నుంచి కోర్టు చౌరస్తా, రైల్వేస్టేషన్ మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది.