Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే పంచాయతీలకు పూర్వ వైభవం
- తండ్రీ, కొడుకులు రాష్ట్రాన్ని అధ్వాన్నంగా మార్చారు
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్పంచుల ఆత్మహత్యలు
- చనిపోయిన కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి: రేవంత్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సర్పంచుల నిధులను, విధులను బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొడుతున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీని బొందపెట్టి, కేసీఆర్‌కు అధికారం లేకుండా చేస్తేనే పంచాయతీలకు పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో 60మంది సర్పంచులు చనిపోయారని తెలిపారు. ప్రభుత్వ వైఖరి వల్ల చనిపోయిన ప్రతి సర్పంచ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్ వద్ద 'నిధులు, విధులపై సర్పంచుల శంఖారావం' నిర్వహించారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందన్నారు. ప్రభుత్వ వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకున్నదనీ, అయినా హైకోర్టు అనుమతితో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. సర్పంచులకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సర్పంచుల వాటాను వారి ఖాతాలో వేయాల్సి ఉంటుందన్నారు. కానీ వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తున్నదని విమర్శించారు. సర్పంచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతోపాటు ఆత్మహత్యలకు ఉసిగొల్పింది కేసీఆరేనన్నారు. కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే సర్పంచులకు రావాల్సిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా చెట్లు చనిపోయినా వారికి సస్పెండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాలనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ని ఏం చేయాలని ప్రశ్నించారు. కేటీఆర్ నిర్లక్ష్య వైఖరితో మూసీలో మునిగి 30 మంది చనిపోయారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పుట్టబోయే బిడ్డమీద కూడా కేసీఆర్ రూ. లక్షా 50వేల అప్పు వేశారనీ, తెలంగాణ మోడల్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
నాలుగువేల కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్...వాటిలో ఎక్కడైనా భవనాలు కట్టించారా? అని నిలదీశారు. ప్రగతిభవన్, సెక్రటేరియట్లకు వేల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ సర్పంచులకు నిధులు విడుదల చేయకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సర్పంచుల నిధులు ఎవరూ దొంగిలించకుండా పటిష్ట చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థులు రేవంత్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, కోదండరెడ్డి, అద్దంకి దయాకర్, పుష్పలీల, చెరుకు సుధాకర్, సిద్దేశ్వర్ తదితరులు మాట్లాడారు.
పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపైచర్యలు తీసుకోండి : డీజీపీకి రేవంత్ వినతి
పార్టీ ఫిరాయించిన 12మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం సోమవారం హైదరాబాద్‌లో డీజీపీని కలిసింది. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులను దాడులపై ఫిర్యాదు చేసింది. గొంతుపై కాలుపెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారని పేర్కొంది. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని భావించామనీ, కానీ తమ పార్టీ నాయకులు నాగం జనార్దన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని రేవంత్ విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఈనెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని చెప్పారు.