Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నో నిర్బంధాలను తట్టుకుని సేవలు
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాజ్యసభ మాజీ సభ్యులు పెనుమల్లి మధు
- ఉప్పల కాంతారెడ్డి అంతిమయాత్రలో నివాళి
నవతెలంగాణ-మునగాల
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఉప్పల కాంతారెడ్డి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని, ఎన్నో నిర్బంధాలను తట్టుకుని నిలబడ్డారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాజ్యసభ మాజీ సభ్యులు సభ్యులు పెనుమల్లి మధు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మునగాల మాజీ సర్పంచ్, సింగిల్ విండో మాజీ చైర్మెన్ ఉప్పల కాంతారెడ్డి (88) మృతిచెందారు. కాంతారెడ్డి మృతదేహాన్ని వారు సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడు దశాబ్దాలపాటు విరామం ఎరుగని పోరాట యోధులుగా కాంతారెడ్డి మంచి గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. చిన్ననాటి నుండే బాలల సంఘాల్లో చేరి విప్లవ రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్నారని చెప్పారు. ఎన్ని కష్టనష్టాలొచ్చినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారని గుర్తు చేశారు. అతివాద, మితవాద ధోరణులను ఎదిరించి నిలబడ్డారని తెలిపారు. అనేక నిర్బంధాలను తట్టుకొని మార్క్సిస్టు పార్టీని కంటికి రెప్పలా కాపాడిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. నీతిగా, నిజాయితీగా ఆదర్శ కమ్యూనిస్టుగా, ఆజాత శత్రువుగా కడదాకా ప్రజల వెన్నంటి నిలిచారని కొనియాడారు. మునగాల జమీందారీ వ్యతిరేక పోరాటంలోనూ, భూ పోరాటాలు, ప్రజాపోరాటాలు, కూలిపోరాటాలు, రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు.
ఈ ప్రాంతంలో గొప్ప కమ్యూనిస్టు నాయకున్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి సీపీఐ(ఎం)కు, ప్రజాసంఘాలకు తీరనిలోటన్నారు. వారి కుటుంబాకి సంతాపం, సానుభూతి తెలిపారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో వారు పాల్గొని కాంతారెడ్డికి విప్లవ జోహార్లర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు ములకలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొలిశెట్టియాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, దేవరం వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల కాంతారెడ్డి మరణం పట్ల సీపీఐ(ఎం) సంతాపం
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీపీఐ(ఎం) ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు ఉప్పల కాంతారెడ్డి సోమవారం మునగాలలో మరణించారు. వారి మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎం) ఆధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్‌రావు సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో ఎన్నో నిర్బంధాలను, జైలు జీవితాలను అనుభవించారని తెలిపారు. జమీందారులకు వ్యతిరేకంగా ఆయన అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. భూమిలేని పేదలనీ కూడగట్టి ఎన్నో భూపోరాటాలు నిర్వహించారని తెలిపారు.అనేక గ్రామాల్లో పేదలకు భూములు పంచారని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) ను బలోపేతం చేశారని గుర్తుచేశారు. కాంతారెడ్డి 2001 వరకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేస్తూ, ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. కాంతారెడ్డి మరణం ప్రజాఉద్యమాలకు తీరని లోటనీ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.