Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో వ్యూహాత్మకంగా పార్టీల అడుగులు
రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. అందుకనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. తమ తమ వ్యూహాలకు అవి పదును పెడుతున్నాయి. ఆయా పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ సభలు, పాదయాత్రలు, సమావేశాలన్నీ రానున్న సాధారణ ఎన్నికలే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ పార్టీలు ఇప్పటి నుంచి కూస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికల రాజకీయాలు మరింత జోరందుకోనున్నాయి.
- సంక్రాంతి తర్వాత మరింత జోరు
- ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ
- రంగంలోకి మోడీ...బీజేపీ రాష్ట్ర నేతల్లో సమన్వయలేమి
- భద్రాచలం నుంచి రేవంత్ పాదయాత్ర
- బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ యాత్రలు
- సైకిల్‌పై పవన్ కళ్యాణ్...బీజేపీతో సోపతి
- టికెట్ వస్తే ఎలా? రాకపోతే ఎలా? ఆలోచనల్లో ఆశావాహులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆయా పార్టీల నేతలు ఎవరికి తోచిన విధంగా వారు పావులు కదుపుతున్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీలు అనేక ప్రకటనలు చేస్తూనే, మరోవైపు అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
సంక్రాంతికే ఎన్నికల శంఖారావం
టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన క్రమంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈనెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అని చెబుతున్నా...దీంతోనే ఆ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నది. ఇక్కడి నుంచి దేశ ప్రజలకు ఏం చేయబోతారో చెప్పేందుకు కసరత్తు ప్రారంభించింది. నదిజలాల సద్వినియోగం, రైతుల సమస్యలు, ఆహార భద్రత తదితర అంశాలతోపాటు తెలంగాణాలో అమలవుతున్న పథకాలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తామనే సంకేతాలు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ ఎన్నికలకు పావులు కదుపుతున్న నేపథ్యంలో దాన్ని అక్కడే కట్టడి చేసేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. ఏకంగా ప్రధాని మోడీని రప్పిస్తున్నది. హైదరాబాద్ వేదికగా సభకు ప్లాన్ చేసింది. మరోవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను అక్కున చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ తో గాలం వేయటానికి ప్లాన్ చేసినట్టు కనపడుతున్నది.
మునుగోడులో ప్లాన్ రివర్స్...
ఖమ్మంలో మరో ప్లాన్
మునుగోడులో బీజేపీ ప్లాన్ రివర్సయింది. అంతటితో ఊరుకోకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వల విసిరింది. ఆ జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన ఆయన...బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన్ను చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే పొంగు లేటి బీజేపీలో చేరుతారనే వార్తలు ఊపందు కున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు వస్తారంటూ ముందుగానే ఆపార్టీ పుకార్లు పుట్టిస్తున్నది. ఆ తర్వాత బీజేపీలో చేర్చుకుంటున్నది. కమలనాథుల ఎత్తులను చిత్తు చేసేందుకు వీలుగా కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు... అదే రేవంత్ వ్యూహం
అంతర్గత కుమ్ములాటల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కూడా తామేమీ తక్కువ తినలేదంటూ... పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈనెల 26 పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఆ యాత్రను భద్రాచలం నుంచి అడుగులు పడనున్నాయి. యాత్ర ద్వారా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎదుర్కొవడం ఒక ఎత్తైతే, పార్టీ సీనియర్ నేతల నోర్లు మూయించడం మరో ఎత్తు. అందుకోసం రేవంత్ అన్ని విధాల సిద్ధమవుతు న్నారు. ఇప్పటికే అధిష్టానం కూడా రేవంత్‌కు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలిసింది. బీఎస్పీ కూడా రానున్న ఎన్నికల్లో తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్ని స్తున్నది. ఆ పార్టీని మునుగోడు ఎన్నికలు నిరాశ పరిచినప్పటికీ ముందుకు సాగుతున్నది. వైఎస్ ఆర్టీపీ అధినేత్రి షర్మిల తమ పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆమె వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దీంతో వరంగల్‌లో జరగాల్సిన ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వడం లేదు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆమె పూనుకున్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్టీపీ వెనుక బీజేపీ ఉన్నదనే చర్చ కొనసాగుతున్నది.
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు ముక్కలాట
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాద్‌లో భేటీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఆ రెండు పార్టీలు బీజేపీ జతకట్టి, తెలంగాణలోనూ బీజేపీకి సహకరించేందుకు ప్లాన్ చేస్తున్నాయనే చర్చ జోరందుకుంది. ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల వాతావరణ పరిస్థితులు రావడంతో ఆశావాహులు కూడా ఆలోచనల్లో పడ్డారు. సొంత పార్టీలో టికెట్ రాకపోతే తమ భవిష్యతు ఏంటనే ఆందోళనతో ఉన్నారు. ఈ పరిస్థితి బీఆర్ఎస్లో ఎక్కువగా కన పడుతున్నది. ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురు లేదా ఐదు మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ లోనూ ఇదే పరిస్థితి నిండుకుండలా ఉన్నది. ఆయా పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపు తిప్పు కునేందుకు బీజేపీ కాచుకుని కూర్చున్నది.