Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 మీటర్లు దూకినా ఎంపిక చేయని వైనం
- షాట్‌పుట్ 6 మీటర్లు వేసినా అర్హత పొందలే
- పరుగుపందెంలో రాణించినా కొలువుకు దూరం
- ఆర్మీకి కూడా లేని నిబంధనలు అమలు
- 'పోలీసు' అభ్యర్థుల గోస పట్టని సర్కారు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ నియామక ప్రక్రియలో నిబంధనల ప్రకారం దేహదారుఢ్య పరీక్షల్లో చిన్నచిన్న కారణాలతో అనర్హులుగా ప్రకటించడం పట్ల వేలాది మంది అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. కొన్నేండ్ల నుంచి ఇంటిని వదిలి ప్రాక్టీస్ చేసినా అడ్డగోలు నిబంధనలతో సర్కారు తమ జీవితాలతో చెలగాటమాడిందని కుమిలిపోతున్నారు. లాంగ్‌జంప్ అభ్యర్థులను నిండాముంచింది. ఆర్మీకి కూడా లేని నిబంధనలను పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు వర్తింపచేశారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్లు పరుగుపందెంలో అర్హత సాధించినా లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో అనర్హులు కావడం గమనార్హం. గత నోటిఫికేషన్లో ఉన్న నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు పూర్తిగా మార్చాయి. అవే అభ్యర్థులకు శాపంగా పరిణమించాయి. గత నోటిఫికేషన్లో పురుషుల పరుగుపందెం 800 మీటర్లు ఉండేది. దాన్ని అధికారులు 1,600 మీటర్లకు పెంచారు. మహిళల పరుగుపందెం గతంలో 100 మీటర్లు ఉంటే, దాన్ని 800 మీటర్లకు పొడిగించారు. పురుషులకు లాంగ్‌జంప్ దూరాన్ని 3.8 మీటర్ల నుంచి నాలుగు మీటర్లకు పెంచారు. షాట్‌పుట్ దూరాన్ని 5.6 మీటర్ల నుంచి ఆరు మీటర్లకు పొడిగించారు. మహిళలకు 3.75 మీటర్ల దూరాన్ని నాలుగు మీటర్లకు పెంచారు. పరుగుపందెంలో (పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్లు) అర్హత పొందినా లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో అర్హత సాధించకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు కొలువుకు దూరమయ్యారు. ఇంకోవైపు నోటిఫికేషన్లో ప్రకటించిన నిబంధనల ప్రకారం పురుషులు లాంగ్‌జంప్ నాలుగు మీటర్లు దూకినా కూడా వారిని మెయిన్స్ రాతపరీక్షలకు ఎంపిక చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు మీటర్ల కంటే ఎక్కువ దూకిన వారినే అధికారులు ఎంపిక చేశారు. ఇక షాట్‌పుట్ ఆరు మీటర్ల దూరం వేసిన వారు కూడా అర్హత పొందలేకపోయారు. ఆరు మీటర్ల కంటే ఎక్కువ దూరం వేసినోళ్లనే మెయిన్స్ రాతపరీక్షలకు ఎంపిక చేశారు.
గతంలో సులభంగా మెయిన్స్‌కు ఎంపిక
రాష్ట్రంలో 17,516 పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు 5,07,890 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో ప్రిలిమినరీ రాతపరీక్షలో 2,07,106 మంది అర్హత సాధించారు. ఈవెంట్లు నిర్వహించిన తర్వాత మెయిన్స్ రాతపరీక్షలకు 1,11,209 మందిని పోలీసు నియామక బోర్డు ఎంపిక చేసింది. వారికి మార్చి 12 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పాత పద్ధతిలో ఈవెంట్లను నిర్వహిస్తే అభ్యర్థులు సులభంగా మెయిన్స్ రాతపరీక్షలకు ఎంపికయ్యే అవకాశముండేది. గత నోటిఫికేషన్లో ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత పొందిన వారికి ఐదు రకాల ఈవెంట్లను నిర్వహించేవారు. అందులో పురుషులకు 800 మీటర్లు, వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్ ఉండేవి. అందులో 800 మీటర్ల పరుగుపందెంలో అర్హత సాధించడం తప్పనిసరి. మిగిలిన నాలుగు ఈవెంట్లలో రెండు అర్హత పొందితే మెయిన్స్ రాతపరీక్షలకు ఎంపికవుతారు. అప్పుడు అభ్యర్థులకు చాయిస్ ఉండేది. కానీ ఇప్పుడు 800 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఈ మూడు ఈవెంట్లలోనూ తప్పనిసరిగా అర్హత పొందాలి. ఒక్క దాంట్లో అర్హత లేకపోయినా మెయిన్స్ రాతపరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోతారు.
దీంతో ఉద్యోగానికి దూరమవుతారు. ఇక మహిళలకు సంబంధించి గతంలో వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఈవెంట్లను నిర్వహించారు. అందులో వంద మీటర్ల పరుగుపందెంతో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మిగిలిన రెండింటిలో ఒకదాంట్లో అర్హత పొందితే మెయిన్స్ రాతపరీక్షలు రాసేందుకు ఎంపికయ్యే వారు. కానీ ఇప్పుడు 800 పరుగు పందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ మూడు ఈవెంట్ల నూ తప్పనిసరి చేశారు. అయితే ఎలాంటి చాయిస్ లేకుండా నిబంధనలు రూపొందించడం వేలాది మంది అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారు. పాతపద్ధతిలోనే ఈవెంట్లను నిర్వహిస్తే వేలాది మంది అభ్యర్థులు మెయిన్స్ రాతపరీక్షలకు ఎంపి కయ్యే అవకాశముండేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పరుగుపందెంలో అర్హత పొందిన (పురుషు లు, మహిళలు) అభ్యర్థులందరినీ మెయిన్స్ రాత పరీక్షలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మాకు న్యాయం చేయాలి : శ్రీకాంత్, కరీంనగర్
పోలీసు నియామక బోర్డు తప్పిదం వల్ల మాకు అన్యాయం జరిగింది. నాలుగు మీటర్ల లాంగ్ జంప్ దూకినా అనర్హులుగా ప్రకటిం చడం సరైంది కాదు. పరుగుపందెంలో అర్హత పొందిన వారికి సివిల్, ఎక్సైజ్, ఫైర్, జైల్, వార్డెన్, డ్రైవర్, కమ్యూనికేషన్ పోస్టులు పొందేందుకు మెయిన్స్‌కు ఎంపిక చేయాలి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు నియామక బోర్డుకు ఎలాంటి ఇబ్బంది లేదు.
4 మీటర్లు దూకినా అనర్హులుగా ప్రకటించారు : మహేష్, నాగర్‌కర్నూల్
నేను మూడుసార్లు నాలుగు మీటర్ల గీత వద్ద లాంగ్‌జంప్ దూకాను. అయినా నన్ను అనర్హులుగా ప్రకటించారు. నాలుగు మీటర్ల కంటే ఎక్కువ దూరం దూకాలనడం సరైంది కాదు. ఆ నిర్ణయం వల్ల నేను ఉద్యోగం కోల్పోయాను. పరుగుపందెంలో అర్హత పొందిన నన్ను మెయిన్స్ రాతపరీక్షలకు ఎంపిక చేయాలి.
షాట్‌పుట్ 6 మీటర్ల గీత మీద వేశాను : సోమేశ్, నల్లగొండ
షాట్‌పుట్ ఆరు మీటర్ల గీత మీద వేశాను. అయినా అనర్హులు ప్రకటిం చడం అన్యాయం. డీఎస్పీని రివ్యూ చేయాలని కోరినా స్పందించలేదు. గ్రౌండ్ నుంచి బలవంతంగా బయటికి పంపారు. మాకు న్యాయం చేయాలి.
మూత్రవిసర్జనకూ అవకాశమివ్వలేదు : బోడ బాబురావు, మహబూబాబాద్
పరుగుపందెం అర్హత సాధిం చాను. నాకు మూత్రం వస్తుందం టూ అధికారులను వేడుకున్నా వెళ్లేందుకు అవకాశమివ్వలేదు. దీంతో ఈవెంట్లపై పూర్తిగా కేంద్రీకరించలేకపో యాను. అయినా లాంగ్‌జంప్ ఐదు మీటర్లు దూకినా ఫౌల్ పేరుతో అనర్హునిగా ప్రకటించారు. రివ్యూ అడిగినా అవకాశం కల్పించలేదు. సీసీ ఫుటేజీ బయటపెట్టాలి. లేదంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తాం.