Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడిగడ్డ తండాపై సీఆర్పీఎఫ్ డేగ
- కాలనీల్లో కవాతులు, పేదల గుడిసెలపై దాడులు, బెదిరింపులు
- బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న 3000 కుటుంబాలు
- కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రికి విన్నవించినా ఫలితం శూన్యం
- భూములకు పట్టాలు ఇప్పించి, కేంద్ర బలగాల నుంచి కాపాడాలని బాధితుల డిమాండ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'మా తాతల కాలం నుంచి గీడనే బతుకుతున్నాం. కూలీ నాలీ చేసుకుని పూట గడుపుతున్నం. గీ గుడిసెలే మా ఆస్తి.. గిప్పుడు ఈ గుడిసెల నుంచి మమ్మల్ని ఎల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుండ్రు.. గీ భూములు సీఆర్పీఎఫ్ పోలీసోళ్ల యి అంటుండ్రు.. పోలీసోళ్లంటే రక్షణ భటులని ఇన్నాం గానీ గీళ్లు మా మీదే దాడి జేస్తుండ్రు. రాత్రుళ్లు కాలనీల్లో కవాత్ జేస్తుంటే.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. కాలనీ ఎంట్రెస్స్లో చెక్‌పోస్టు పెట్టిండ్రు.. కూలిన గుడిసెలకు మరమ్మతులు చేసుకుందామన్న, బాత్రూంలు కట్టుకుందామన్న ఇటుక పెళ్ల కూడా తేెనిస్తలేరు. గుడిసెలు ఖాళీ చేయాల్సిందే అని బెదిరింపులకు దిగుతుండ్రు.. మా గోసను ఏండ్ల సంధీ కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా మొర పెట్టుకున్నా వినే నాథుడే లేడు. గీ బలగాల నుంచి మమ్మల్ని కాపాడేదెవ్వరో..' అని మియాపూర్ పరిధిలోని నడిగడ్డ తండా ప్రజలు తమ గోడును 'నవతెలంగాణ' ముందు వెల్లబోసుకున్నారు. సీఆర్పీఎఫ్ బలగాల అరాచకాలకు బలవుతున్న పేదలపై కథనం.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా సర్వే నెంబర్ 28లో 'జిలాని బేగం' (నావాబ్) వారసురాలికి సుమారు 251 ఎకరాల భూమి ఉంది. ఈమె విదేశాలకు వెళ్లే క్రమంలో దేశం నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా వెళ్తూ దేశ రహస్యలను ఇతర దేశాలకు చేరవేస్తుందన్న నెపంతో ఈ భూములను ఎనిమీ ప్రాపర్టీగా ప్రభుత్వం గుర్తించింది. అయితే జిలాని బేగం ఇక్కడ ఉన్నప్పటి నుంచే ఈ భూముల్లో పేదలు నివసిస్తున్నారు. సుమారు 80 ఏండ్ల కిందట ఇటుక బట్టిల్లో పనిచేయడానికి వచ్చారు. ప్రస్తుతం 25 ఎకరాల్లో ఓంకార్కాలనీ, సుభాష్‌చంద్రబోస్, నడిగడ్డతాండ, న్యూ కాలనీలుగా ఏర్పడి సుమారు 3000 కుటుంబాలు ఉన్నాయి. వీరు ఈ భూములకు పట్టాలు ఇవ్వాలని ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఈ భూములు ఎనిమీ ప్రాపర్టీ అని, కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే హెచ్ఎమ్డీఏకు 132 ఎకరాలు, మెట్రోసేష్టన్కు మరో 104 ఎకరాలు ప్రభుత్వం ఎలా కేటాయించిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే 28 సర్వే నెంబర్లో 25 ఎకరాల్లో పెద్ద నాయకులు భవనాలు నిర్మిస్తే హెచ్ఎమ్డీఏ, జీహెచ్ఎమ్సీ అధికారులు పర్మిషన్లు ఇచ్చారని చెబుతున్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న భూములు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ అధీóనంలో ఉన్నాయా? బడాబాబులకు ఇచ్చే భూములకు ఎలాంటి ఆంక్షాలు లేవా? అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
నడిగడ్డపై సీఆర్పీఎఫ్ డేగ
ఇదిలా ఉంటే పేదల గుడిసెలపై సీఆర్పీఎఫ్ బలగాల కన్నుపడింది. పేదలను గుడిసెల నుంచి ఖాళీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ భూములు ప్రభుత్వం తమకు అప్పగించిందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పత్రాలు చూపుతూ పేదలను బెదిరింపులకు గురిచేస్తున్న పరిస్థితి. కాలనీ ప్రారంభంలో చెక్‌పోస్టు పెట్టి.. కాలనీలోకి కనీసం ఇటుక పెళ్ల కూడా తీసుకెళ్లకుండా అడ్డకట్ట వేస్తున్నారు. అర్థరాత్రి కాలనీ వీధుల్లో కవాత్ చేస్తూ స్థానికులను భయభ్రంతులకు గురిచేస్తున్నారు. పేదల గుడిసెల్లోకి చొరబడి సామాగ్రిని బయటకు పడేసిన ఉదంతాలు ఉన్నాయి. సీఆర్పీఎఫ్ బలగాల దాడులు, బెదిరింపులతో పేదల బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
వినతులకు.. విచారణలకు విలువేది.. ?
తమ జాగాలకు పట్టాలు ఇప్పించండని నెత్తినోరు మెత్తుకున్నా, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా.. ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ కమిషన్ విచారణ జరిపి, హోం శాఖకు నివేదిక ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. కేంద్ర మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లకు తమ గోడును వెల్లబోసుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా తమ భూములకు పట్టాలు ఇప్పించి, సీఆర్పీీఎఫ్ బలగాల నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
నాది మూడో తరం
- పాండు నాయక్, గుడిసె వాసి, నడిగడ్డతాండ
నాకు ఊహ తెలిసే నాటికి ఇదంతా అడవి. ఇక్కడ మేము తప్పా ఎవరూ ఉండేవారు కాదు. మా తాతలు, తండ్రులు ఇటుక బట్టీల్లో పనిచేస్తూ జీవనం సాగించేది. గిప్పుడు సీఆర్పీఎఫ్ పోలీసులు మమ్మల్ని నానా తిప్పలు పెడుతున్నారు. ఇండ్లు కూలుతున్నా మరమ్మతులు చేసుకుందామంటే ఏమీ చేయనిస్తలేరు. చిన్న మూట వెంట తెచ్చుకున్నా తనిఖీ చేస్తున్నారు.
మా బతుకులపై ఎవరికీ కనికరం లేదు
- రత్నం, నడిగడ్డతాండ కాలనీ అధ్యక్షులు
ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం లేకుండాపోతోంది. బీసీ కమిషన్ నేతృత్వంలో విచారణ జరిపి పేదల భూములకు క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా వాటిని బేఖాతార్ చేశారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం
- దశరథ, నడిగడ్డతాండ
ఇండ్లు కూలిపోతున్నవి, బాగు చేయించుకుందా మంటే పోలీసోళ్లు చెక్‌పోస్టు పెట్టుకుని చిన్న రాయి కూడా తేనివ్వడం లేదు. బాత్రూమ్లు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో పోలీసుల అరాచకాలతో కాలనీవాసులు భయందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టులు తొలగించి, పేదల ఇంటి జాగాలకు పట్టాలు ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది
- అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
ఎన్నో ఏండ్లుగా అక్కడ పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ కాలనీలో మౌలిక వసతుల కోసం కోట్లు కేటాయించి నిర్మాణాలు చేపట్టాం. సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకోవడంతో ఏమీ చేయలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం పేదల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.