Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో అడుగుపెట్టనివ్వం
- 18న ఖమ్మం సభకు కేరళ ముఖ్యమంత్రి హాజరు
- బీజేపీని అడ్డుకునేందుకు రాష్ట్రంలో బీఆర్ఎస్తో కలిసి పని చేస్తాం: తమ్మినేని
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న బీజేపీ ఆశలను అడియాసలు చేసే దమ్ము కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ కలలను కల్లలు చేసే సత్తా కమ్యూనిస్టులకే ఉందని చెప్పారు. అది ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో స్పష్టమైందన్నారు. అదే పద్ధతిలో రాష్ట్రం మొత్తంగా బీజేపీని అడ్డుకుంటామన్నారు. ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగసభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరవుతున్నారని తెలిపారు. బీజేపీ మతోన్మాద విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు భవిష్యత్‌లోనూ బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి నిధులూ కేటాయించకుండా వివక్ష చూపిస్తోందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించని బీజేపీ నాయకులకు ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు బలంగా ఉన్న జిల్లాల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తుందని, అందుకోసం ఇతర పార్టీలో ఉన్న బలమైన నేతలను లాక్కునేందుకు ప్రలోభాలకు గురిచేస్తుందని విమర్శించారు. బీజేపీ మతోన్మాద విధానాలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సెమినార్లు, సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి ఐక్యంగా ప్రజా సమస్యలపై పోరాడుతాయన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.